కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మాజీ సీఎం చంద్రబాబు చాలా కాలం తర్వాత భేటీ అయ్యారు. ఒక విధంగా రెండుపార్టీల మధ్య పొత్తు బంధం తెగిపోయాక చాలా ఏళ్ల తర్వాత మళ్లీ వీరిద్దరూ భేటీ కావడం ఇదే మొదటిసారి. రెండు పార్టీలకు సంబంధించి ఏపీ తెలంగాణల్లో పొత్తులపై విపరీతమైన చర్చ జరుగుతున్న సమయంలో ఈ ఇద్దరు ప్రముఖుల భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. అటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకూడా పాల్గొన్న ఈ సమావేశం దాదాపు గంటకుపైగా సాగింది. ఇంత కీలక మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు.. ఏం చర్చించారన్నది మాత్రం ఇప్పటికీ గుంభనమే.
2019ఎన్నికల ముందు బీజేపీతో బంధం తెంచేసుకుని బయటికొచ్చింది టీడీపీ. కేంద్ర కేబినేట్‌లో ఉన్న టీడీపీ మంత్రులు రాజీనామా చేస్తే.. ఏపీ ప్రభుత్వంలో ఉన్న బీజేపీ మంత్రులు రాజీనామా చేశారు. ఆ తర్వాత ప్రత్యేక హోదా, ఏపీకి నిధుల కేటాయింపు విషయంలో అమిత్‌షా తిరుపతి వచ్చినపుడు టీడీపీ కార్యకర్తలు అలిపిరి వద్ద నిరసనకు దిగి రాళ్లు కూడా రువ్వారు. అలాగే ప్రధాని మోదీ విజయవాడ వచ్చిన సందర్భంలో గన్నవరం ఎయిర్ పోర్టు దగ్గర నల్లబెలూన్లతో నిరసనకు దిగారు టీడీపీ కార్యకర్తలు. ఇంతలా రెండు పార్టీల మధ్య ఇక పూడ్చడం కష్టమన్నంత గ్యాప్ వచ్చేసింది. గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ విడివిడిగానే పోటీ చేశాయి. టీడీపీ ఓటమి పాలైంది.
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక బీజేపీ పెద్దలను కలిసేందుకు చాలాసార్లు ప్రయత్నించారు చంద్రబాబు. ఇన్నేళ్ల తర్వాత తొలిసారి అమిత్ షా అపాయింట్‌మెంట్ ఫిక్స్ చేయడంతో ఇద్దరూ భేటీ అయ్యారు. అయితే విచిత్రమేమంటే ఈ ఇద్దరి భేటీకి సంబంధించి ఒక్కటంటే ఒక్క కూడా ఫొటో బయటికి రాలేదు,. గంటపాటు సాగిన భేటీ తర్వాత ఆ సమావేశంలో అసలు ఏం చర్చించారనే సారాంశం కూడా బయటికి పొక్కలేదు. సాధారణంగా దేశ హోంమంత్రితో ఎవరు భేటీ అయినా ఏ సమావేశం జరిగినా హోంమంత్రి కార్యాలయం ఫొటోలు విడుదల చేస్తుంది. వీడియోలు కూడా బయటికి పంపుతారు. భేటీ జరిగిన విషయాన్ని అధికారిక ట్విటర్‌లోనైనా ఇస్తారు. కానీ అమిత్‌షా-చంద్రబాబు భేటీ తర్వాత ఫొటోలు లేవు.. వీడియోలు లేవు.. ట్వీట్లు లేవు.. కనీసం ప్రెస్ నోట్ కూడా లేదు.
చిన్నచిన్న నాయకులు కలిస్తేనే ఫొటోలు బయటికొస్తాయి. కానీ ఇంతటి ప్రాధాన్యం ఉన్న మీటింగ్‌కి సంబంధించి ఎలాంటి సమాచారం బయటికి ఇవ్వకపోవడంపై అటు బీజేపీలో ఇటు టీడీపీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆ ఇద్దరూ భేటీలో ఏం చర్చించారనేది కూడా బయటికి తెలీదు. వ్యూహాత్మకంగానే ఈ మీటింగ్‌కి సంబంధించి ఎలాంటి సమాచారం బయటికి ఇవ్వడం లేదా అనే చర్చ కూడా నడుస్తోంది. ఆర్నెల్లలోపే తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రధానంగా ఈ భేటీలో పొత్తుల గురించే మాట్లాడుకున్నారని రెండు పార్టీల్లో చర్చించుకుంటున్నారు.. 2018లో తెలంగాణలో కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకుంది. ఈసారి బీజేపీతో పొత్తుపెట్టుకుంటారా..లేక బయటి నుంచి మద్దతిస్తారా అనేదానిపైనా రాజకీయవర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.
ఇంటాబయటా ఇంత డిస్కషన్ జరుగుతున్నా…ఆ భేటీపై రెండు పార్టీలు ఇంతవరకూ నోరు విప్పడం లేదు. బీజేపీతో పాటు ఇటు టీడీపీ కూడా ఇంతవరకూ ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదు. కనీసం చంద్రబాబు ట్వీట్ కూడా చేయలేదు. ఆపార్టీ కార్యకర్తలు కూడా కామెంట్ చేయడం లేదు. మిగిలిన రాజకీయపక్షాల్లోనూ ఆ మీటింగ్‌లో ఏం జరిగింది.. ఏం మాట్లాడుకుని ఉంటారన్న విషయం ఉత్కంఠగానే ఉంది.
మరిన్ని ఏపీ వార్తల కోసం..