ఏపీలో వర్షాలు కంటిన్యూ అవ్వనున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక తీర ప్రాంతం మీదుగా ఆవర్తనం కొనసాగుతుంది. ఇది సముద్ర మట్టానికి 7.6 కి.మీ వరకు విస్తరించి ఉంది. దీంతో ఈశాన్య రుతుపవనాలు యాక్టివ్ అయ్యాయి. ఫలితంగా తమిళనాడు అయితే వర్షాలు దంచికొడుతున్నాయి. దక్షిణ కోస్తా, రాయలసీమలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో రెయిన్ కంటిన్యూ అవుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం, ఈశాన్య రుతుపవనాల ప్రభావం ఉమ్మడి చిత్తూరు జిల్లాపై గట్టిగా పడింది. మంగళవారం నుంచి జిల్లావ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయన్న ఐఎండి హెచ్చరికతో జిల్లా యంత్రాంగం అప్రమత్తం అయ్యింది. భారీ వర్షాలకు అవకాశం ఉండడంతో ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్, ఎస్పీ సిబ్బందికి సూచించారు. ప్రమాదకరంగా ఉన్న బ్రిడ్జిలు, కాజ్ వేలను గుర్తించి.. జాగ్రత్తలు తీసుకోవాలని తహాసీల్దారులకు,ఆర్ అండ్ బి అధికారులకు ఆదేశాలు అందాయి.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వర్షం దంచికొడుతోంది. ఎడతెరపిలేని వానతో జనజీవనం స్తంభించింది. మరో రెండు రోజుల పాటు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో అధికారులు అప్రమత్తమైయ్యారు. మరోవైపు సోమశిల, కండలేరు జలాశయాలు నిండుకుండల్లా మారాయి. ఎడతెరిలేని వర్షం ఉదయగిరి, ఆత్మకూరు రైతులకు అపార నష్టాన్ని మిగిల్చింది. వేలాది ఎకరాల్లో పంటకు నష్టం జరిగింది. ఏపీలోని పలు జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అల్లూరి, ఏలూరు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంది.
ఇక హెవీ రెయిన్ అలర్ట్‌తో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వర్షం పడుతున్నప్పుడు రైతులు, రైతు కూలీలు చెట్ల కింద నిలబడవద్దని హెచ్చరించింది. కరెంట్ పోల్స్ వంటివి ముట్టుకోవద్దని సూచించింది.
మరిన్ని ఏపీ వార్తల కోసం..