
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా మరో మూడు రోజులపాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. ఎండి ప్రఖర్ జైన్ ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శుక్రవారం రాత్రి నుంచే వర్షాలు ఉధృతంగా కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. అల్లూరి, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇదే తరహా వర్షాలు రాయలసీమ జిల్లాల్లోనూ నమోదు కావొచ్చని పేర్కొంది.
శనివారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో వర్ష తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురవచ్చన్నది వారి అంచనా.
వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే అవకాశం, ట్రాఫిక్ సమస్యలు, గాలివానలతో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తలెత్తే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిస్తోంది. ఇక వర్షాల కురిసే సమయంలో చెట్ల కింద ఉండవద్దని.. సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి