కరువు సీమ అనంతపురం జిల్లాలో ఒక అద్భుత సంఘటన చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా అంటేనే తీవ్ర వర్షాభావ పరిస్థితులు గుర్తుకొస్తాయి. అయితే ఇలాంటి ప్రాంతంలో బోరు బావి నుంచి నీరు ఎగసి పడుతోంది. బత్తలపల్లి మండలం గరిశనపల్లి గ్రామంలో ఈ దృశ్యం కనువిందు చేసింది. అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలం గరిశనపల్లి గ్రామానికి చెందిన ఒక రైతు రెండేళ్లక్రితం బోర్ వేశారు. అయితే, నీరు సరిగా రాకపోవడంతో బోరును మూసివేశారు. ఇది జరిగి దాదాపు రెండేళ్లు కావస్తోంది. అయితే, మొన్న సాయంత్రం హఠాత్తుగా బోరు నుంచి నీరు ఎగసిపడింది. బోరుకు అడ్డంగా కట్టిన సంచి, రాయి కూడా పక్కకు ఎగసిపడింది. ఏకంగా 30 అడుగుల మేర నీరు బయటకు ఉబికి వచ్చి ఎగసి పడింది.
ఇది చూసిన గ్రామస్తులు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. గత రెండేళ్లుగా సమృద్ధిగా వర్షం కురిసినప్పటికీ ఏ రోజు ఇలా జరగలేదని, అయితే ఇప్పుడు వర్షాభావం ఉన్న పరిస్థితుల్లో ఇలా జరగడం నిజంగానే ఆశ్చర్యపడాల్సి విషయంగా చెబుతున్నారు. ఈ జల దృశ్యం చూసేందుకు సమీప ప్రాంతాల ప్రజలు తరలివచ్చారు. ఇక తనకు నీటి కష్టం తీరిందని ఆ రైతు సంతోషం వ్యక్తం చేశారు.
Also Read: జస్ట్ 100 రూపాయల కోసం మాజీ వైస్ చాన్సలర్ దారుణ హత్య..