గడిచిన మూడు రోజుల నుంచి రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థపై పెద్ద ఎత్తున వివాదం నడుస్తోన్న విషయం తెలిసిందే. వారాహి విజయ యాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏలూరులో ప్రసంగిస్తూ వాలంటీర్ల గురించి సంచలన ఆరోపణలు చేశారు. మహిళా అదృశ్యం కేసులు వెనుక వాలంటీర్స్ సేకరిస్తున్న డేటా ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. దీనిపై అధికార పార్టీతో పాటు వాలంటీర్ల పవన్ కల్యాణ్ పై పెద్ద ఎత్తున విరుచుకు పడ్డారు.
మెరుగైన సేవలు అందించిన వ్యవస్థను కించపరుస్తూ మాట్లాడటం సరికాదని ఆ విధంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు కూడా చెప్పారు. పలు చోట్ల పవన్ కళ్యాణ్ చిత్ర పటాలను చెప్పులతో కొట్టడమే కాకుండా దహనం కూడా చేశారు. పవన్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన ఏపీ మహిళ కమిషన్ సైతం నోటీసులు జారీ చేసిన విషయం విధితమే. పవన్ దగ్గర ఉన్న రిపోర్ట్ ఎవరిచ్చారో చెప్పాలంటూ లేదంటే మహిళలకు క్షమాపణలు చెప్పాలని నోటీసులో పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే ఈ వివాదం ఇలా నడుస్తుండగానే వాలంటీర్ వ్యవస్థను కొనియాడుతూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి మహిళా వాలంటీర్ కాళ్లు కడిగి సన్మానించారు. దుగ్గిరాల మండలం ఈమనిలో రజిత అనే మహిళా వాలంటీర్ కాళ్లు కడిగి శాలువాతో సత్కరించారు. కరోనా సమయంలో విశిష్ట సేవలు వాలంటీర్లు అందించారన్నారు. రాజకీయాలకు అతీతంగా పని చేస్తున్న వ్యవస్థలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. వాలంటీర్ కాళ్లు కడిగి సన్మానం చేయడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..