
విజయనగరం జిల్లాలో హోంగార్డ్ నెట్టి శ్రీనివాసరావు అవినీతి వ్యవహారం ఉత్కంఠగా మారుతుంది. ఏసీబీ అధికారులు నిందితుడ్ని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. సమర్పించిన ఆధారాలను పరిశీలించిన న్యాయమూర్తి ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కేసులో అరెస్ట్ అయిన హోంగార్డ్ అక్రమ సంపాదన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. కేసులో తవ్వేకొద్ది ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. హోంగార్డ్ నెట్టి శ్రీనివాసరావు ఇంటిపై జరిగిన ఏసీబీ సోదాలు సంచలనగా మారాయి. పోలీస్ శాఖలో చివరి స్థానమైన పోలీస్ హోంగార్డుగా పనిచేస్తూ 20 కోట్లు అక్రమంగా సంపాదించిన వ్యవహారం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సుమారు 36 గంటల పాటు విజయనగరం, గుర్లతో పాటు విశాఖపట్నంలో రెండు చోట్ల జరిగిన సోదాల్లో అనేక స్థిర, చర ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. విజయనగరం, విశాఖపట్నంలో ఇళ్ల స్థలాలు, అపార్ట్మెంట్లో ఫ్లాట్స్, పలు మండలాల్లో ప్రభుత్వ స్థలాలు బంధువుల పేర్లపై పట్టాలు పొందినట్లు అధికారులు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే తీగ లాగితే డొంక కదిలినట్లు.. సోదాలకు వెళ్లిన ఏసీబీ అధికారులు శ్రీనివాసరావు మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని పలు కీలక సమాచారం సేకరించారు. అంతేకాకుండా అతని పర్సనల్ డైరీలో పలు కీలక సమాచారం సైతం సేకరించారు. హోంగార్డ్ శ్రీనివాసరావుకు పలువురు జిల్లా అధికారులతో పాటు సబ్ రిజిస్టర్ కార్యాలయాలతో లింక్స్ ఉన్నట్లు ప్రాథమిక గుర్తించారు. అవినీతి అధికారులకు సమాచారం ముందస్తుగా ఇస్తూ.. వారి వద్ద నుంచి లంచాలు పొందినట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ క్రమంలోనే ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్టర్ కార్యాలయాలపై ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసిన వ్యవహారంలో కూడా హోంగార్డ్ శ్రీనివాసరావు ముందస్తు సమాచారం ఇచ్చాడనే విషయం తెలుస్తుంది. జిల్లా స్థాయిలో పనిచేస్తున్న పదుల సంఖ్యలో ఉన్నతాధికారులతో క్రమం తప్పకుండా సంప్రదింపులు కొనసాగించిన రికార్డులు, ఆర్థిక లావాదేవీల వివరాలు లభ్యమయ్యాయి. అలాగే శ్రీనివాస్ మొబైల్ ఫోన్‌లో పలువురు అధికారులతో
ఆడియోలు, వాట్సాప్ సంభాషణలు గుర్తించారు. అంతేకాకుండా ఎంతో గోప్యంగా ఉండే సమాచారం పలు కార్యాలయాలకు అందించినట్లు గుర్తించారు.
ప్రధానంగా భోగాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంతో సంబంధాలు, అనేక ఆర్థిక లావాదేవీలు ఉన్నట్టు వెలుగు చూసింది. భూ రిజిస్ట్రేషన్ సంబంధిత డాక్యుమెంట్ పనుల్లో మధ్యవర్తిగా పనిచేసినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దాదాపు 15 ఏళ్లపాటు ఏసీబీలో పనిచేసిన అనుభవంతో వ్యవస్థలోని బలహీనతలను గుర్తించిన శ్రీనివాస్ తన చేతివాటానికి పదును పెట్టాడు. ఫిర్యాదు వచ్చిన వెంటనే.. ఏ అధికారులపై కేసు నమోదు కానుందో ముందే సమాచారం చేరవేసేవాడు. టార్గెట్ అయిన అధికారులు తన వద్దకు వచ్చి సెటిల్మెంట్లు చేసుకునేలా మార్గం కల్పించేవాడు. కేసు రిజిస్టర్ అయ్యే ముందు సమాచారం లీక్ చేసి లంచం తీసుకునే విధంగా వ్యవస్థను వాడుకున్నట్టు అధికారులు నిర్ధారించారు. శ్రీనివాసరావు వ్యక్తిగతంగా సంప్రదించిన అధికారుల జాబితా చూసి దర్యాప్తు బృందం సైతం ఆశ్చర్యపోయింది. మున్సిపల్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ విభాగాల అధికారులతో విస్తృత సంబంధాలు ఉన్నాయి. ప్రతి విభాగంలో డబ్బులు వసూలు చేసినట్టు గుర్తించారు. ఈ కేసులో దర్యాప్తు మరింత వేగంగా కొనసాగుతోంది. హోంగార్డుతో సంబంధాలు ఉన్న అధికారులను కూడా ఒకొక్కరిని విచారణకు పిలవాలని నిర్ణయించుకున్నారు ఎసిబి అధికారులు.
మొబైల్, ల్యాప్‌టాప్, పెన్‌డ్రైవ్స్‌లో ఉన్న డేటాను పూర్తిగా రీ స్టోర్ పనిలో పడ్డారు అధికారులు. ఇదంతా చూసిన ఎసిబి అధికారులకు అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇది ఒక వ్యక్తి చేసిన తప్పు మాత్రమేనా? లేక జిల్లా స్థాయిలో ఇంకా ఎవరైనా ఈ నెట్ వర్క్‌లో ఉన్నారా? అన్నదానిపై కూడా దృష్టి సారిస్తున్నారు. ఏసీబీ అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు సరైన సమాచారం ఇవ్వనట్లు తెలుస్తుంది. అధికారులు దీనిపై లోతైన విచారణ జరుపుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.