ప్రమాదాన్ని తగ్గిస్తుందనుకుంటే.. ఏకంగా ప్రాణాలే తీసింది.. ఇంతకు ఏం జరిగిందంటే?
విజయనగరం జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. అధికారుల నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. రహదారిపై మధ్యలో స్పీడ్‌బ్రేకర్ నిర్మించిన అధికారులు ఎలాంటి హెచ్చరికల బోర్డు ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాదానికి గురై ఓ వ్యక్తి మరణించాడు. దీంతో రోడ్డు నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యటు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

అధికారుల నిర్లక్ష్యం ఓ యువ అటవీశాఖ ఉద్యోగి ప్రాణాన్ని బలితీసుకుంది. విజయనగరం జిల్లాలో చోటుచేసుకున్న హృదయ విదార ఘటన అందరినీ కలిచివేస్తుంది. జిల్లాకేంద్రంలోని రింగ్ రోడ్డు మరమ్మతుల నిమిత్తం కొత్తగా మరోసారి తారు వేసి రోడ్డు నిర్మాణం చేశారు. అలా రోడ్డు నిర్మాణం చేస్తూ రింగ్ రోడ్డులో ప్రమాదాలు నివారించేందుకు రోడ్డు పై పలుచోట్ల స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేశారు. కానీ స్పీడ్ బ్రేకర్స్ ను వాహనదారులు గుర్తించేందుకు మాత్రం ఎలాంటి హెచ్చరిక బోర్డులు పెట్టలేదు. కనీసం రేడియం స్టిక్కర్స్ కూడా పెట్టలేదు. దీంతో రాత్రి సమయంలో స్పీడ్ బ్రేకర్స్ స్పష్టంగా కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నప్పటికీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు.
అయితే సోమవారం తెల్లవారుజామున అటవీశాఖ స్ట్రైకింగ్ ఫోర్స్‌లో పనిచేస్తున్న రాంజీ (32) బైక్ పై వెళ్తూ స్పీడ్ బ్రేకర్‌ను ఢీకొని అదుపుతప్పి ఎగిరిపడ్డారు. దీంతో అతని తలకు బలమైన గాయం తగిలింది. గమనించిన స్థానికులు అతన్ని వెంటనే స్థానికి హాస్పిటల్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ కన్నుమూశారు. రాంజీ మరణంతో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అయితే రాంజీ పెళ్లై కేవలం రెండేళ్లే కావడంతో అతని భార్య, చంటి పాప ఇప్పుడు అనాధలుగా మారారు. కుటుంబానికి ప్రధాన ఆధారంగా ఉన్న రాంజీ లేకపోవడంతో వారు ఇప్పుడు తమ జీవితాన్ని ఎలా సాగించాలో తెలియక కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
మరోవైపు ఈ ఘటన పై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రహదారి భద్రతపై పెద్ద ఎత్తున ప్రచారాలు నిర్వహించే అధికారులు, ప్రాథమిక భద్రతా చర్యలు తీసుకోవడంలో మాత్రం విఫలమవుతున్నారని విమర్శిస్తున్నారు. ఇలాంటి నిర్లక్ష్యంతో మరిన్ని ప్రాణాలు బలికాకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారులు ఈ ఘటనను సీరియస్ గా తీసుకుని బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు, రహదారి భద్రతా ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
