విశాఖ కిడ్నీ మాఫియా ప్రధాన సూత్రధారులను బయటకు లాగాలని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు డిమాండ్ చేశారు. ఈ కిడ్నీ మాఫియాలో ప్రధాన సూత్రధారులు ఎవరున్నా సరే తక్షణమే అరెస్ట్ చేసి, విచారణ చేపట్టాలన్నారు. రాష్ట్రంలో కనీస జీవనాధారం లేని నిరుద్యోగ యువతను, నిరుపేద కుటుంబాలను విశాఖ కిడ్నీ మాఫియా పావులుగా వాడుకుంటోందన్నారు. వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి ప్రజలు బలవుతున్నారని ఆరోపించారు. ద్విచక్ర వాహనం కొనిస్తామని ఆశ చూపి శరీర అవయవాలు దోచుకునే స్థితికి వ్యవస్థను తీసుకొచ్చారు అంటేనే పరిస్థితి అర్థం అవుతోందన్నారు. ఇంతకాలం గుట్టు చప్పుడు కాకుండా నడిపించిన కిడ్నీ రాకెట్ బాధితులు ఒక్కొక్కరుగా బయటికి వస్తున్నారని.. ఇంకెంతమంది బాధితులు ఉంటారో అనే ఆందోళన రోజు రోజుకూ పెరిగిపోతోందన్నారు. సాధారణ, పేద కుటుంబాలు నివాసం ఉండే ప్రాంతాలను టార్గెట్ చేసుకొని పెద్దా చిన్న, ఆడ మగ తేడా లేకుండా అసలేం జరుగుతోందో తెలుసుకునే లోపే బాధితుల కిడ్నీలు మాయం చేస్తున్నట్లు తెలుస్తోందన్నారు.
సాధారణ, పేద కుటుంబాలు నివాసం ఉండే ప్రాంతాల్లో వైద్య పరీక్షలు నిర్వహించి ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారు అనే సంగతి నిగ్గు తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని నాగబాబు అన్నారు. గతంలో కూడా విశాఖలో కిడ్నీ మాఫియా శరీర అవయవాలతో వ్యాపారం చేశారని.. ప్రభుత్వ నిర్లక్ష్యం మోసగాళ్ళకు అలవాటుగా మారిపోయిందన్నారు. రాష్ట్రంలో విద్యావంతులైన యువతకు ప్రభుత్వం సరైన ఉద్యోగ అవకాశాలు అందించలేని కారణంగా అడ్డదారులు తొక్కుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. విశాఖ మహానగరంలో కిడ్నీ మాఫియాను నిర్మూలించాల్సిన బాధ్యత ప్రభుత్వంకు ఉందని నాగబాబు అన్నారు.
మరిన్ని ఏపీ వార్తలు చదవండి..