ఆ ఊళ్లు, దేశాలు ఇక కనపడవు.. విశాఖ నగరం సగం మాయవుతుందట.. పాపం ఎవరిది?

World Ocean Day 2021: సముద్రాల్లో కాలుష్యం ప్రమాద ఘంటికలు మోగిస్తున్న వేళ...ఇవాళ (జూన్‌ 8న) ప్రపంచ సముద్రాల దినోత్సవం రోజు కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తోంది ఐక్యరాజ్య సమితి(ఐరాస). ఈ సమావేశంలో 45 దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు.

ఆ ఊళ్లు, దేశాలు ఇక కనపడవు.. విశాఖ నగరం సగం మాయవుతుందట.. పాపం ఎవరిది?
World Ocean Day
Follow us
Janardhan Veluru

|

Updated on: Jun 08, 2021 | 5:38 PM

World Ocean Day 2021: ఈ భూ గ్రహం పై 3 వంతుల నీరు కాగా ఒక వంతు మాత్రమే నేల. 29 శాతం మాత్రమే భూమి మిగిలినదంతా సముద్రపు నీరే ఉంది. సముద్రపు జలాలు రోజూ కలుషితం అవుతూనే ఉన్నాయి. నిత్యం వేల టన్నుల్లో చెత్త సముద్రంలో కలుస్తోంది. సముద్రాల్లో కాలుష్యం ప్రమాద ఘంటికలు మోగిస్తున్న వేళ…ఇవాళ (జూన్‌ 8న) ప్రపంచ సముద్రాల దినోత్సవం రోజు కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తోంది ఐక్యరాజ్య సమితి(ఐరాస). ఈ సమావేశంలో 45 దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. 1992లో బ్రెజిల్‌లోని రియో డిజనీరోలో జరిగిన యూఎన్‌ఓ సదస్సులో సముద్రాలపై అవగాహన పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. జాన్ 8, 2008న తొలిసారిగా ప్రపంచ సముద్ర దినోత్సవాన్ని నిర్వహించిన యూఎన్‌ఓ..సముద్రాలు బాగుండాలి… జీవులూ బాగుండాలి అనే నినాదాన్ని బలంగా వినిపించింది.

తీర ప్రాంతాలకు సముద్ర జలాలు చొచ్చుకువస్తున్నాయి. దీంతో ఎప్పుడు ఏ జలగండం వస్తుందోనని తీర ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. భారత దేశానికి 8,118 కి.మీ పొడవైన తీర ప్రాంతముంది. ఎనిమిది రాష్ట్రాలను, రెండు ద్వీపాలు, 5,700 కి.మీ ద్వీప కల్పాలను సముద్రం తాకుతోంది. వాతావరణ మార్పుల వల్ల ఈ ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. హిమానీనదాల ద్వారా ఏర్పడిన నదుల నీటి ద్వారా గంగా పరివాహక ప్రాంతం మార్పులకు గురవుతోంది. 20వ శతాబ్ధంలో 10 నుంచి 20 సెంటీ మీటర్ల వరకు సముద్ర మట్టం పెరిగింది. దీనికి తోడు ఉష్ణోగ్రతల మార్పులతో సముద్రం ముందుకు చొచ్చుకు వస్తోంది. ప్రతీ సంవత్సరం 0.8 నుంచి 1.1 మీటర్‌ వరకు సముద్రం ముందుకు వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముంబై, చెన్నై,కొచ్చి లాంటి ప్రదేశాలలో ప్రతీ ఏడాది 3 మి.మీ మేర సముద్రం చొచ్చుకొస్తోంది. భూ మండలంపై పెరుగుతున్న ఉష్ణోగ్రతలు..సముద్రంలో కలుస్తున్న ఇతర నీరే దీనికి కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2100 సంవత్సరం నాటికి 18 నుంచి 59 సెం.మీ. సముద్ర మట్టం ముందుకు వస్తుందని అంచనా వేస్తున్నారు.

Sea Level

Sea Level

ముంబై నగరం మాయం ఐక్య రాజ్య స‌మితికి చెందిన ఇంట‌ర్‌గ‌వ‌ర్న‌మెంట‌ల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ (ఐపీసీసీ) విభాగం ప్ర‌పంచంలోని 36 దేశాల్లో 100కు పైగా సైంటిస్టుల‌తో అధ్య‌య‌నాలు జరిపింది. సముద్రతీరాలు కలిగిన నగరాల్లో నీరు ముందుకు చొచ్చుకురావడంపై అధ్యయనం జరిపారు. 2050 నాటికి ముంబై న‌గ‌రంలో చాలా ప్రాంతాలు అరేబియా స‌ముద్రంలో మునిగిపోతాయట.

ఎందుకంటే…? హిమానీ న‌దాలు క‌ర‌గ‌డం, భూగ‌ర్భ జ‌ల వన‌రులు అంత‌రించిపోతుండ‌డం, కాలుష్యం త‌దిత‌ర అనేక అంశాల కారణంగా స‌ముద్ర మ‌ట్టాలు క్ర‌మంగా పెరుగుతున్నాయి. ప్ర‌స్తుతం ఉన్న స్థితి క‌న్నా అరేబియా స‌ముద్ర మ‌ట్టం మ‌రో 100 నుంచి 110 సెంటీ మీట‌ర్లు పెరగనుంది. దీంతో ముంబై న‌గ‌రంలో చాలా ప్రాంతాలు స‌ముద్రంలో మునిగిపోవ‌డం ఖాయ‌మ‌ని సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు. స‌ముద్ర తీరంలో ఉన్న సూర‌త్, కోల్‌క‌తా, చెన్నై, అండ‌మాన్ దీవుల‌కు కూడా ముప్పు వాటిల్లే అవకాశం ఉందంటున్నారు. ఆయా ప్రాంతాల‌కు ద‌గ్గ‌ర‌లో ఉన్న స‌ముద్ర మ‌ట్టాలు మ‌రో 50 సెంటీ మీట‌ర్లు పెరిగితే ఆ న‌గ‌రాలు మాయమయ్యే ప్రమాదముంది. ముంబై నగరం చాలా వరకు మునిగిపోతుందన్న న్యూజెర్సీకి చెందిన శాస్త్రవేత్తల స్వతంత్ర సంస్థ క్ లైమేట్‌ సెంట్రల్‌ అంచనావేసింది.

ఆంధ్రప్రదేశ్‌లో.. ఆంధ్రప్రదేశ్‌ కోస్తాతీరంలో 974 కి.మీ దూరం సముద్రముంది. ఏపీలో పలు సార్లు సముద్రం ముందుకు రావడంతో తీర ప్రాంత ప్రజలు భయాందోళన చెందారు. అక్టోబర్‌ 11, 2014 విశాఖ జిల్లా నక్కపల్లి మండలంలోని రాజయ్య పేట, బోయపాడు, బంగారంపేట గ్రామాల వద్ద 60 అడుగుల మేరకు సముద్రం ముందుకు వచ్చింది. జూన్‌13, 2018న ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి పలు నెల్లూరు నుంచి శ్రీకాకుళం దాకా అంతకంతకూ సముద్రపు నీరు చొచ్చుకొచ్చింది. శ్రీకాకుళం జిల్లాలో 100 అడుగులు, విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాంలో 50 అడుగుల మేర ముందుకు చొచ్చుకొచ్చింది. అక్టోబర్‌ 11, 2018 శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం డొంకూరు కవిటి మండలం కొత్తపాలెం వద్ద 20 నుంచి 30 మీటర్ల మేర సముద్రం ముందుకు రావడంతో తీర ప్రాంత ప్రజలు వణికిపోయారు. డిసెంబర్‌ 18,2018 మంగినపూడిలో 20 మీటర్ల మేర సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. మే2, 2019 విశాఖ ఆర్కే బీచ్, రుషికొండ బీచ్, యారడ్ బీచ్ లలో సముద్రజలాలు ముందుకు చొచ్చుకొన్ని తీర ప్రాంతాల ప్రజలను వణికించాయి. మే19, 2020 అంఫాన్ తుపాను కారణంగా 30 మీటర్ల మేర సముద్రం ముందుకొచ్చింది. మే 25, 2020 కోవిడ్‌ సమయంలో తుఫాన్‌ సమయంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. తూర్పుగోదావరి జిల సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలెంలో 2 కి.మీ. ముందుకు వచ్చింది సముద్రం. నవంబర్‌ 27, 2020 హంసలదీవి వద్ద సముద్ర జలాలు 20 మీటర్లు ముందుకు చొచ్చకు వచ్చాయి.

విశాఖపట్నం సేఫ్‌ నా?.. మరో 100 ఏళ్లల్లో విశాఖ నగర తీరం సగం మాయం కావచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. తుఫాన్లు మచిలీపట్నం, బంగ్లాదేశ్‌ వైపు మాత్రమే వస్తుంటాయి. కొండలు ఎక్కువగా ఉండడంతో తుఫాన్ల ప్రభావం విశాఖపై తక్కువే. కానీ ఆర్కే బీచ్‌, రుషికొండ తీరం సాగర కెరటాల తాకిడికి ధ్వంసమయ్యాయి. ఆర్కే బీచ్‌లో అలల ఉద్ధృతికి రక్షణగోడతో పాటు కాలిబాట కూలిపోయింది. సముద్రం దాదాపు 150 అడుగులు ముందుకు రావడంతో కాలిబాటలు కొట్టుకుపోయాయి. విశాఖ నగరాన్ని ఏటా 45 లక్షల మంది పర్యాటకులు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి సందర్శనకు వస్తుంటారు. మరో 5 లక్షల మంది విదేశీ పర్యాటకులు వస్తుంటారు.  ఆర్కే బీచ్‌, రుషికొండ, భీమునిపట్నం, యారాడ బీచ్‌లు రానున్న 50 ఏళ్లల్లో కనుమరుగయ్యే ప్రమాదముంది. రుషికొండ బీచ్‌కు ఏటా 25 లక్షలకుపైగా పర్యాటకులు సందర్శిస్తుంటారు. ఈ ప్రాంతం కోతకు గురవ్వడంతో కలకలకం ఏర్పడుతోంది.

ఏం చేయాలంటే…? తీర ప్రాంత కోతలపై శాశ్వత పరిష్కారాన్ని చూపాల్సిన అవసరముంది. ఆర్కేబీచ్‌లో కురుసురా మ్యూజియం వద్ద తీరం భారీగా కొట్టుకుపోయింది. దీనికి శాశ్వత పరిష్కారం కోసం రూ. 3.50 కోట్లతో తయారు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. విదేశాల తరహాలో జియోట్యూబ్‌ ఏర్పాటు, అండర్‌ వాటర్‌ డైక్స్‌ వంటివి నిర్మించాలని నిపుణులు సూచించారు. బీచ్‌ కోతలపై శాశ్వత పరిష్కారాన్ని చూపగలిగితే మంచిదనే వాదన వినిపిస్తోంది. లేకపోతే స్మార్ట్ సిటీ మనుగడకు ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు.

ఆ మూడు దేశాలు మాయం 2100 నాటికి మాల్దీవులు సహా మరో నాలుగు దీవులు మాయమయ్యే అవకాశముంది. మరో 80 ఏళ్లలో అనగా 2100 నాటికి మాల్దీవులు మాయమవుతాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. మాల్దీవ్స్‌, ఫిజితో పాటు మరో మూడు అందమైన దీవులు నీటిలో మునిగిపోతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గ్లోబల్ వార్మింగ్ నే దీనికి కారణమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్ వల్ల సముద్ర మట్టం క్రమంగా పెరుగుతోంది. 1940లో అమెరికన్ శాస్త్రవేత్త బెనో గుటెన్‌బర్గ్ సముద్రంలో నీరు పెరుగుదల పై అధ్యయనం జరిపారు. గత 100 సంవత్సరాల డేటా అధ్యయనం జరపగా..ధృవాల వద్ద మంచు కరగడం వల్ల సముద్రంలో నీటి మట్టం నిరంతరం పెరుగుతోందని గుటెన్‌బర్గ్‌ వెల్లడించారు. దీన్ని 1990లో నాసా ధృవీకరించింది. గ్లోబల్ వార్మింగ్ వల్ల తలెత్తే​ సమస్యల ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన చర్చ జరుగుతోంది.

ఇవి కూడా చదవండి..

మానవత్వం పరిమళించిన వేళ..! కరోనా పేషెంట్‌కు భోజనం తినిపించిన నర్సులు..

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 25 కి.మీ నడిచే ఎలక్రిక్ సైకిల్స్ లాంచ్.. సామాన్యులకు అందుబాటులో ధరలు