గిరిజన యువతికి ప్రేమ పేరుతో లోబర్చుకుని మోసం కేసులో కోర్టు నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. ఏడు వేల జరిమానా కూడా విధించింది. అంతేకాదు.. నిందితుడికి సహకరించిన మరో నలుగురితో పాటు అతని కుటుంబ సభ్యులకు కూడా జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది విశాఖ న్యాయస్థానం. అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి బి ఆర్ మూర్తి చెప్పిన వివరాల ప్రకారం..
అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం పాకలు గ్రామానికి చెందిన గిరీష్ కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. నడింపల్లి గ్రామానికి చెందిన గిరిజన యువతిని ప్రేమ పేరుతో నమ్మించాడు. తనకు అప్పటికే పెళ్లి జరిగిందనే విషయాన్ని దాచి.. పెళ్లి చేసుకుంటానని లోబర్చుకున్నాడు. పెళ్లి చేసుకోవాలని అడిగితే సీక్రెట్ గా తప్పించుకుని తిరిగాడు. విషయం పెద్దల వరకు వెళ్లి పంచాయతీ జరిగింది. దీంతో ఆ గిరిజన యువతని కుటుంబంలో తీసుకున్నందుకు అంగీకరించారు గిరీష్ అతని కుటుంబ సభ్యులు. ఆ తర్వాత మళ్లీ మాట మార్చాడు గిరీష్.
2021 ఆగస్టు 25న బాధితురాలపై దాడి చేయబోయాడు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. అరెస్టు చేసి కటకటాల వెనుక నట్టారు. గిరీష్ కుటుంబ సభ్యుల పాత్ర పైన విచారణ చేసి చార్జ్ షిట్ ఫైల్ చేశారు పోలీసులు. నిందితులకు శిక్ష పడేలా అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి వి ఆర్ మూర్తి వాదించారు. సాక్షాధారలను పరిశీలించిన న్యాయస్థానం ప్రధాన నిందితుడు గిరీష్ కు పదేళ్ల జైలు శిక్షతో పాటు ఏడు వేల రూపాయల జరిమానా.. అతని కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి 6000 రూపాయలు చొప్పున జరిమాన విధిస్తూ తీర్పు ఇచ్చింది.