Visakhapatnam – Arilova Love Story: పెద్దలు కుదిర్చిన పెళ్లి వద్దంటూ డయల్ 100 కి నిన్న ఫోన్ చేసిన యువతి గుర్తుందా! ఆమె ఇవాళ ప్రేమ పెళ్లి చేసుకుంది. సింహాద్రి అప్పన్న సాక్షిగా మనసిచ్చినోడిని మనువాడింది భార్గవి. మహిళా చేతన నేత కత్తి పద్మ.. దగ్గరుండి భార్గవి పెళ్లి జరిపించారు. భార్గవి మేజర్. పెద్దలు బలవంతంగా పెళ్లి చేస్తున్నారంటూ నిన్న విశాఖపట్నం పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసింది. దీంతో.. పోలీసులు సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆమెను ఇంటి నుంచి ఆరిలోవ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు.
భార్గవి మేజర్ కావున.. ఆమె ఇష్టప్రకారం నిర్ణయం తీసుకునే హక్కు ఉందంటూ తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు పోలీసులు. పేరెంట్స్ కూడా భార్గవి చెప్పినట్టు విన్నారు. ఇష్టంలేని పెళ్లి చెయ్యబోమంటూ మాటిచ్చారు. కట్‌చేస్తే.. ఇవాళ సింహాచలం దేవస్థానంలో భార్గవి ప్రేమ వివాహం చేసుకున్నారు.
కాగా, నిన్న కొన్ని గంటల్లో పెళ్లి.. మూడుముళ్ల తతంగానికి పెద్దలంతా తరలి వచ్చే సమయంలో భార్గవి అనూహ్యంగా పెళ్లి వేడుకని కొత్త మలుపు తిప్పింది. ధైర్యంగా ఈ 22 ఏళ్ల పెళ్లి కూతురు పెళ్లి పీటలపైకి ఎక్కేవేళ డయల్ 100కి కాల్ చేసి పోలీస్ కంట్రోల్ రూమ్‌కి ఫిర్యాదు చేసింది. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు కాపాడాలని విశాఖపట్నం అరిలోవ ప్రాంతానికి చెందిన ఈ కొత్త పెళ్లి కూతురు ఇంట్లో వాళ్లకి తెలియకుండా పోలీస్‌లకు ఫిర్యాదు చేసింది. వెంటనే అలర్టయిన పోలీసులు యువతి దగ్గరికి వెళ్లి ఆమెను సేఫ్‌గా అరిలోవ పోలీస్ స్టేషన్‌కి తరలించారు.
ఇవన్నీ చూసి ఏం జరుగుతుందో అర్థం కాని పేరెంట్స్ మొత్తం మేటర్ తెలిసొచ్చేసరికి అవాక్కయ్యారు. ఎందుకిలా చేశావని కన్నకూతురిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేషన్ వద్దకు వచ్చిన యువతి బంధువులు.. ఇష్టం లేకపోతే పెళ్లి మానేస్తామని ఇంటికి రావాలంటూ యువతిని కోరినప్పటికీ ఇంటికి వెళ్లేందుకు భయపడింది. అంతలోనే పెళ్లి కూతురు ఇచ్చిన సమాచారం మేరకు మహిళా సంఘాలు కూడా ఠాణాకి వచ్చేశాయి. చివరికి ఇవాళ ప్రేమించిన వాడితోనే భార్గవికి వివాహం జరిపించి పెళ్లి తంతు పూర్తి చేశారు మహిళా సంఘాల నేతలు. దీంతో భార్గవి ప్రేమకు పెళ్లి రూపంలో శుభం కార్డు పడింది.
Read also: Madurai flyover collapse: ఘోర ప్రమాదం.. కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్