
టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు శ్రీనివాస మూర్తి(75) కరోనాతో మృతి చెందారు. కరోనా బారిన పడ్డ ఆయన నాలుగు రోజులు క్రితం స్విమ్స్‌లో చేరారు. అక్కడే చికిత్స పొందుతూ ఇవాళ తుది శ్వాస విడిచారు. కాగా శ్రీనివాస మూర్తి దాదాపు 30ఏళ్లకు పైగా శ్రీవారి ఆలయంలో ప్రధాన అర్చకుడిగా సేవలు అందించారు. టీడీపీ హాయంలో మిరాశీ వ్యవస్థ రద్దు చేయడంతో గోవిందరాజస్వామి ఆలయంలో ప్రధాన అర్చకుడిగా శ్రీనివాస మూర్తి పదవీ విరమణ చేశారు. ఆయనకు ఇద్దరు కుమారులు దయానిధి మూర్తి దీక్షితులు, నరసింహమూర్తి దీక్షితులు ఉన్నారు. పెద్ద కుమారుడు దయానిధిమూర్తి దీక్షితులు గోవిందరాజస్వామి ఆలయంలో.. చిన్న కుమారుడు నరసింహమూర్తి దీక్షితులు శ్రీవారి ఆలయంలో అర్చకుడిగా విధులు నిర్వహిస్తున్నారు.
ఇదిలా ఉంటే తిరుమలలో కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ఇప్పటికే 21 మంది అర్చకులకు కరోనా పాజిటివ్ సోకింది. టీటీడీ అనుబంధ ఆలయాల్లోనూ కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో పనిచేసే పోటు వర్కర్‌కి కరోనా సోకింది. దీంతో పోటును, ఆలయాన్ని, పరిసరాల ప్రాంతాలను శానిటైజ్ చేస్తున్నారు. ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆదివారం శ్రీనివాస మంగపురం రెండు పాజిటివ్ కేసులు రావడంతో ఆలయం మూసేశారు. మిగిలిన అర్చకులు, ఇతర సిబ్బంది కరోనా టెస్టులు చేయించుకోవాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. గత నెలలో తిరుపతి గోవిందా రాజస్వామీ ఆలయంలో పనిచేసే ఓ వ్యక్తికి కరోనా సోకింది.