Mother with newborn baby : అడవితల్లి బాలింత బిడ్డలను ఇంటికి చేర్చే తల్లీబిడ్డా ఎక్స్‌ప్రెస్ మూలనపడింది. అంబులెన్స్ ఏర్పాటు చేయడానికి వైద్యాధికారికి దయ కలగలేదు. చేసేది లేక పొత్తిళ్లలోని బిడ్డను తన తల్లి చేతికిచ్చి నడకదారి పట్టింది ఆ ఆదివాసీ పచ్చి బాలింత. పండంటి బిడ్డకు జన్మనిచ్చి 24 గంటలు కూడ గడవక ముందే… పొట్ట చేతపట్టుకుని మండే ఎండలో ఎనిమిది కిలోమీటర్లు నడిచి సొంత ఇంటికి చేరాల్సిన దుస్థితి గిరిజన మహిళకు దాపురించింది. విశాఖ జిల్లా గూడెం కొత్తవీధి మండలంలోని పామురాయి గ్రామానికి చెందిన పాంగి కుమారి(28) ఎదుర్కొన్న కష్టం ఇది.
బుధవారం కుమారికి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు జీకేవీధి ఆస్పత్రికి తీసుకొచ్చారు. అదే రోజు మధ్యాహ్నం ఆమె ప్రసవించింది. గురువారం ఆమెను వైద్యులు డిశ్చార్జి చేశారు. గ్రామానికి వెళ్లేందుకు అంబులెన్స్ ఏర్పాటు చేయాల్సిందిగా బాలింత బంధువులు వైద్యాధికారిని అడగ్గా వాహనం పాడైపోయిందని సమాధానమిచ్చారు.
వైద్యాధికారి ప్రత్యామ్నాయంగా అంబులెన్స్ అయినా ఏర్పాటు చేయకపోవడంతో బాలింత కుమారి అతికష్టమ్మీద ఎనిమిది కిలోమీటర్ల దూరంలో గల తమ గ్రామానికి మండుటెండలో కాలినడకన చేరుకుంది. ఈ ఉదంతంపై ఆవేదన వ్యక్తం చేసిన బాలిత కుటుంబసభ్యులు తమకు ఇలాంటి సమస్యలు ఎదుర్కోవడం మామూలే అంటూ నిట్టూర్చారు.