తెలంగాణ ఆపిల్స్‌..మ‌రో నెల‌రోజుల్లో మార్కెట్లోకి..

|

May 05, 2020 | 4:39 PM

తెలంగాణ‌లో పండిన ఆపిల్స్ కోత‌కు వ‌చ్చాయ‌ట‌. మ‌రో నెల‌రోజుల్లో మార్కెట్లోకి అందుబాటులోకి వ‌స్తాయంటున్నారు ఆపిల్స్ సాగుచేసిన రైతులు. వివ‌రాల్లోకి వెళితే…

తెలంగాణ ఆపిల్స్‌..మ‌రో నెల‌రోజుల్లో మార్కెట్లోకి..
Follow us on
తెలంగాణ ఆపిల్స్…ఏంటీ అనుకుంటున్నారా..? అవును ఇప్పుడు తెలంగాణ‌లో ఆపిల్స్ పండుతున్నాయి. అధిక ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌య్యే తెలంగాణ‌లో ఆపిల్స్ పంట‌లేంటి అనే అనుమానం రావొచ్చు. కానీ, ఇది వాస్త‌వం తెలంగాణ‌లో పండిన ఆపిల్స్ కోత‌కు వ‌చ్చాయ‌ట‌. మ‌రో నెల‌రోజుల్లో మార్కెట్లోకి అందుబాటులోకి వ‌స్తాయంటున్నారు ఆపిల్స్ సాగుచేసిన రైతులు. వివ‌రాల్లోకి వెళితే…
తెలంగాణ కశ్మీర్‌గా పేరొందిన కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో ఆపిల్స్ సాగుచేస్తున్నారు. జిల్లాలోని కెరమెరి మండలం దనోరా గ్రామంలో ఆపిల్ పంట సాగవుతోంది. ప్రభుత్వ సాయంతో ధనోరాకు చెందిన రైతు ఒక‌రు రెండు ఎకరాల విస్తీర్ణంలో 400 ఆపిల్ మొక్కలు నాటారు. మరో నెలరోజుల్లో పంట చేతికి వ‌స్తుంద‌ని చెప్పారు. సీసీఎంబీ శాస్త్రవేత్తలు 2014లో హరిమన్‌ రకానికి చెందిన 150 మొక్కలను ఆ రైతుకు అంద‌జేశారు. వారి సలహాలను తీసుకుంటూ సాగు చేయగా.. 100 మొక్కలు పెరిగాయి. రెండో ఏట కాయలు కాశాయి. 2016లో వ్యవసాయశాఖ మరో 300 మొక్కలు ఇచ్చింది.
మూడేళ్లుగా కాయలను కోయకుండా చెట్లకే వదిలేశాడు. ప్రస్తుతం కాయలు 200 గ్రాముల బరువు తూగుతున్నాయి. ఒక్కో చెట్టుకు 20 నుంచి వరకు 40 కాయలున్నాయి. మరో నెల రోజుల్లో కోతకు వచ్చే సమయానికి కాయల బరువు 250 గ్రాముల వరకు పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఆపిల్ సాగు ప్రయోగాత్మకంగా విజయవంతం కావడంతో.. ఆ ఊళ్లోని చాలా మంది రైతులు ఆపిల్ సాగుకు మందుకొస్తున్నారు. దీంతో తెలంగాణ‌లోనూ క‌శ్మీర్ ఆపిల్స్ అందుబాటులోకి రానున్నాయి.