విశాఖలో మత్తు ఇంజక్షన్ల సరఫరా జోరుగా సాగుతోంది. మత్తు ఇంజక్షన్లను సరఫరా చేస్తోన్న ముఠా గుట్టు రట్టు చేశారు విశాఖ టాస్క్ ఫోర్స్ పోలీసులు. విశాఖలోని లీలా మహల్ ప్రాంతంలో నిర్వహించిన తనిఖీల్లో 3 వేల మత్తు ఇంజక్షన్ శాంపిల్స్‌ని సీజ్ చేశారు. ఈ మత్తుజగత్తు సూత్రధారులైన పశ్చిమబెంగాల్‌కి చెందిన అనుపమ్ అధికారి, కౌశిక్ ,చౌదరిలను పోలీసులు అరెస్టు చేశారు. పెంటాజోసైన్ లాక్టేట్ అనే మత్తు ఇంజక్షన్లను వెస్ట్ బెంగాల్ నుంచి విశాఖకి సరఫరా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ డ్రగ్ ఇంజక్షన్లను వీరి నుంచి కొనుగోలు చేస్తోన్న ముఠా యథేచ్ఛగా విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. విశాఖలో పరిచయస్తుల ద్వారా ఈడ్రగ్స్‌ని విస్త్రుతంగా అమ్ముతున్న తీరు విశాఖలో కలకలం రేపుతోంది. 50 యాంపిల్స్ ఉన్న బాక్స్ ను 2వేలరూపాయలకు అమ్ముతూ డ్రగ్స్ దందా కొనసాగస్తున్నారు ఈ అగంతకులు.
మరోవైపు భీమిలి రెల్లి వీధిలోనూ టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. పద్మ రాఘవరావు అనే వ్యక్తి నుంచి 2 వందల మత్తు ఇంజక్షన్లు సీజ్ చేశారు. అనుపమ్ అధికారి నుంచి రాఘవరావు ఈ మత్తు ఇంజక్షన్లను కొనుగోలు చేసినట్టు నిర్ధారించారు పోలీసులు. 50 యాంపిల్స్ ఇంజక్షన్ల బాక్స్ ను 2వేలకు కొనుగోలు చేసి, వాటిని ఆరు వేలకు అమ్ముకుంటున్నట్టు పోలీసులు గుర్తించారు.
సీపీ శ్రీకాంత్ ఆదేశాలతో మత్తు మాఫియాపై నిఘా పెంచింది టాస్కఫోర్స్. గత నెలలో సైతం మత్తు ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు, ఆ కేసులో కూపీ లాగి మళ్ళీ కీలక నిందితులను అరెస్ట్ చేశారు.