Vizag: విశాఖలో పెళ్లికూతురు మృతిలో షాకింగ్ ట్విస్ట్.. శరీరంలో విషపదార్థం

|

May 12, 2022 | 3:49 PM

పల్లకిలో పెళ్లికూతురు మహారాణిలా వచ్చింది. వేడుకకు వచ్చినవారంతా దంపతులపై తలంబ్రాలు చల్లడానికి సిద్ధమయ్యారు. ఇంతలోనే పెద్ద షాక్‌. అక్కడున్నవారికి ఏం జరుగుతోందో తెలియలేదు. అందంగా ముస్తాబై పెళ్లిపీటలపై కూర్చున్న పెళ్లికూతురు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.

Vizag: విశాఖలో పెళ్లికూతురు మృతిలో షాకింగ్ ట్విస్ట్.. శరీరంలో విషపదార్థం
Bride Death
Follow us on

AP News: ఆకాశమంత పందిరి.. పచ్చని తోరణాలు పంచభూతాల సాక్షిగా.. బంధుగణం మధ్య.. వైభవంగా పెళ్లి తంతు జరుగుతోంది. పల్లకిలో పెళ్లికూతురు మహారాణిలా వచ్చింది.చూడచక్కని జంటను వేదికపై చూసిన బంధువులంతా మురిసిపోయారు. ఇంక కొన్ని క్షణాల్లోనే పెళ్లి తంతు ముగిసి.. వధూవరులు ఒక్కటయ్యే మధుర క్షణాలు అవి. కానీ అంతలోనే అంతులేని విషాదం చోటుచేసుకుంది.  వధూవరులు జీవితాంతం విడిపోకుండా కలిసి ఉండాలనే సంకేతంగా జీలకర్ర బెల్లం పెడతారు. ఆ జీలకర్ర బెల్లం పెడుతుండగానే వధువు ఒక్కసారిగా కుప్పకూలడం.. కొన్ని సెకన్లలోనే ప్రాణాలు కోల్పోవడం.. విశాఖలో అందరినీ షాక్‌కు గురిచేసింది. విష పదార్ధం కారణంగానే వధువు ప్రాణాలు కోల్పోయినట్టు.. డాక్టర్ నుంచి సమాచారం వచ్చిందన్నారు పీఎం పాలెం(PM Palem) సీఐ రవికుమార్. మరోవైపు కడుపు నొప్పి వచ్చిందని పెళ్లికూతురు తల్లిదండ్రులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పెళ్లిరోజు ఉదయం కూడా వధువు ఆస్పత్రికి వెళ్లింది. ఈ వివరాల ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. పోస్టుమార్టమ్‌లో పూర్తి వివరాలు తెలియనున్నాయి. ప్రి వెడ్డింగ్ షూట్‌లో యాక్టివ్‌గా కనిపించిన సృజన.. హఠాత్తుగా మృతి చెందడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె ఆత్మహత్య చేసుకుందా అన్న కోణంపై ప్రధానంగా ఫోకస్ పెట్టారు పోలీసులు.

అందంగా ముస్తాబై పెళ్లిపీటలపై కూర్చున్న పెళ్లికూతురు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. పెళ్లికూతురు కుప్పకూలడంతో ఆమెకు కళ్లుతిరిగి పడిపోయిందని అంతా భావించారు. ముఖంపై నీళ్లు చల్లినా ఆమె లేవలేదు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు బంధువులు. కాని అప్పటికే ఆ పెళ్లికూతురు ప్రాణాలు వదిలింది. డాక్టర్లు ఎంత ప్రయత్నించినా ఆమె బతకలేదు.

హైదరాబాద్‌లోని చందానగర్‌కు చెందిన సృజన పెళ్లి కోసం రెండు రోజుల క్రితమే విశాఖ వెళ్లింది. పెళ్లి తంతు కూడా పూర్తి కావచ్చిన సమయంలో అనుకోని ఘటన జరగడంతో అంతా షాక్‌లోనే ఉండిపోయారు. వివాహ నేపథ్యంలో గత రెండు రోజులుగా పెళ్లి కూతురు అలసటకు గురై నీరసించిందని బంధువులు తెలిపారు. కానీ ఇలా ప్రాణాలు కోల్పోతుందని భావించ లేదని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.