
విశాఖపట్టణం పరవాడలో రాంకీ ఎస్‌ఈటీపీ సాల్వెంట్ ఫార్మా కంపెనీలో జరిగిన పేలుడుపై పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆరా తీశారు. జిల్లా అధికార యంత్రాంగంతో ఫోన్ ద్వారా ప్రాథమిక సమాచారాన్ని అడిగి తెలుసుకున్న మంత్రి.. క్షతగాత్రులకు అవసరమైన వైద్య సదుపాయాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వైద్య, అగ్నిమాపక, పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. కాగా ఎస్‌ఈపీటీ సాల్వెంట్ ఫార్మా కంపెనీలో సోమవారం రాత్రి సమయంలో భారీ పేలుళ్లు సంభవించాయి. ప్రమాద సమయంలో నలుగురు సిబ్బంది విధుల్లో ఉండగా.. వారిలో మల్లేశ్వరరావు అనే వ్యక్తి గాయపడగా, ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.
ఇక ఈ ఘటనపై మాట్లాడిన క్రైమ్ డీసీపీ సురేష్ బాబు.. పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాం. ఇందులో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఫార్మాసిటీలో జరిగిన ప్రమాదంపై ఇప్పుడే ఒక అంచనాకు రాలేము. విచారణ అనంతరం వాస్తవాలు బయటికి వస్తాయి అని అన్నారు.