అందాల సుందర విశాఖ నగరంలో వేసే ప్రతి అడుగులో ఏదో తెలియని పరవశం మన మనసును తాకుతూ ఉంటుంది. సముద్ర తీరపు అందాలు.. ఎగసిపడే అలలు, కెరటాలు.. మానసిక ప్రశాంతతను అందిస్తాయి. ఇక్కడి పర్యాటక అందాలను మరింత పెంచేందుకు, పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచేందుకు ప్రభుత్వాలు నిరంతరం కృషి చేస్తూనే ఉంటాయి. తాజాగా ప్రభుత్వం ఫ్లోటింగ్ బ్రిడ్జ్‌ను ఏర్పాటు చేసి ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని పెంచే కార్యక్రమాన్ని ప్రారంభించింది. విశాఖ బీచ్‌లో ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్‌ను రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు. సముద్ర తీరం నుంచి 100 మీటర్ల లోపలివరకు.. కోటి 20లక్షల రూపాయలతో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఏర్పాటు చేశారు. విశాఖను పర్యాటకంగా మరింత సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు వైవీ సుబ్బారెడ్డి. తీరం వెంబడి అనేక సరికొత్త పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి చేస్తున్నామని.. అతి త్వరలో విశాఖ పరిపాలనా రాజధానిగా మారుతుందంటూ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ను ప్రారంభించిన అనంతరం అందులో విహరించి అద్భుతమైన అనుభూతిని పొందారు.
ఆంధ్రప్రదేశ్ లోనే కాదు దక్షిణ భారత దేశంలో పర్యాటక ప్రదేశాలు చూడాలంటే విశాఖను సందర్శించకుండా ఉండలేం. పచ్చదనం కప్పేసుకున్న తూర్పు కనుమల మధ్య ఆహ్లదకరమైన వాతావరణంలో విశాఖలో గడిపే ప్రతి క్షణం ఎన్నో తియ్యని అనుభూతులను మిగిలిస్తాయి. రామకృష్ణా బీచ్ నుంచి మొదలు పెడితే సబ్ మెరైన్ మ్యూజియం దగ్గర నుంచి యుద్ద విమానాల ప్రదర్శనశాల సీ హారియర్, కైలాసగిరి, తోట్లకొండ, డచ్ సమాధులు, ఋషికొండ బీచ్, భీమిలి బీచ్, ఏర్రమట్టి దిబ్బలు.. ఇలా చెప్పుకుంటు పోతే ఎన్నో ఉన్నాయి విశాఖలో. . తాజాగా ఈ జాబితాలోకి మరో కొత్త అద్భుతమైన లొకేషన్ . అదే ఫ్లోటింగ్ బ్రిడ్జ్. ఎగసిపడే కెరటాలపై తేలియాడుతూ సముద్రపు అందాలను దగ్గరగా చూడాలని ఆశపడేవారికి ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఒక పెర్ఫెక్ట్ డెస్టినేషన్ అవుతుందనడంలో వేరే ఆలోచనే లేదు.
విశాఖ మెట్రోపాలిటన్ రీజయన్ డెవలప్మెంట్ అథారిటీ – విఎంఆర్డీఏ ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ప్రాజెక్టును చేపట్టి ప్రారంభించింది. రామ కృష్ణ బీచ్ నుంచి పార్క్ హోటల్ మధ్యలో ఉన్న కోకో గార్డెన్స్ సమీపంలో ఫ్లోటింగ్ బ్రిడ్జ్‌ను వీఎంఅర్డీఏ పిపిపి మోడ్‌లో ఏర్పాటు చేసింది.
కెరటాలపై తేలియాడే ఈ బ్రిడ్జిని అనతికాలంలోనే పూర్తిచేశారు. ప్లాస్టిక్ బ్లాకులతో తీరం నుంచి సముద్రంలోకి వంద మీటర్ల మేరకు ఈ బ్రిడ్జి ఉంటుంది. అలలు వచ్చినప్పుడు ఈ బ్రిడ్జిపై నిలబడితే కలిగే అనుభూతిని మాటల్లో వర్ణించడం కష్టమే అంటున్నారు పర్యాటకులు..
మంగళూరు తర్వాత చవక్కాడ్ బీచ్‌లో పర్యాటకులకు చాలా సుపరిచితం ఆయిన ఈ బీచ్ విశాఖ లో దేశంలోనే మూడోది గా నిర్మితమైంది. ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జి మొత్తం 100 మీటర్ల పొడవు వంతెనగా ఉండి, సముద్రపు నీటిపై తేలుతుంది. వ్యూ పాయింట్ దగ్గర 8 నుండి 9 అడుగలు లోతు ఉంటుంది. వంతెన వెడల్పు సుమారు మూడు మీటర్లు. దీనిని హచ్ డీ పీ ఈ మాడ్యులర్ ఫ్లోటింగ్ ఇటుకలతో నిర్మింస్తున్నారు. ఫ్లోటింగ్ బ్రిడ్జి చివర్లో నిలబడితే విశాఖ అందాలు మరింత అద్భుతంగా కనిపించేలా రూపొందిస్తున్నారు. ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జి కోసం.. 1.20 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది పీపీఏ సంస్థ. .
ఫ్లోటింగ్ బ్రిడ్జి వల్ల ఉల్లాసమే కాదు అపాయాల సంగతేంటి అనే ప్రశ్న కూడా సాధారణంగా తలెత్తుతుంది.. పర్యాటకుల సేఫ్టీ విషయంలో యంత్రాంగం పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. లైఫ్ జాకెట్ లేనిదే ఈ బ్రిడ్జ్ పైకి పంపరు, నిరంతరం పర్యవేక్షించేందుకు లైఫ్ గార్డ్స్, రెండు బోట్లు ఉంటాయి. సేఫ్టీ కోసం గజ ఈతగాళ్లు వంతెనపై నిత్యం ఉండాలని, వంతెనకు రెండు వైపులా లైఫ్ బోట్లను అందుబాటులో ఉంచుకోవాలని నిర్వాహకులను ఆదేశించారు కలెక్టర్. .
ఇకపై విశాఖ వచ్చే పర్యాటకులకు ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ సరికొత్త అనుభూతిని కలిగించనున్నదనడం లో ఎలాంటి సందేహం లేదు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..