ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో నరబలి యత్నం కలకలం రేగింది. గుప్త నిధుల కోసం గణేష్ అనే వ్యక్తిని సజీవదహనం చేసేందుకు కొందరు దుండగులు ప్రయత్నించారు. తీవ్రగాయాలతో బయటపడ్డ అతడు.. ప్రస్తుతం చిత్తూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
బాధితుడి కుటుంబసభ్యుల వివరాల ప్రకారం.. గుప్త నిధుల తవ్వకాల కోసం గణేష్ సహా ఏడుగురు వ్యక్తులు చిత్తూరు జిల్లా దొడ్డిపల్లి అటవీ ప్రాంతానికి వెళ్లారు. అక్కడకు వెళ్లిన తరువాత తమిళనాడుకు చెందిన ఓ స్వామీజీతో పూజలు చేయించారు. అనంతరం గణేష్‌ను సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించారు. వారి బారి నుంచి తీవ్ర గాయాలతో గణేష్ తప్పించుకున్నాడు. ఇప్పుడు రుయా ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు విద్యుత్ షాక్ వల్లే గణేష్‌కు గాయాలయ్యాయని గుప్త నిధుల కోసం వెళ్లిన వారిలో రమేష్ అనే వ్యక్తి చెప్పినట్లు గణేష్ కుటుంబ సభ్యులు తెలిపారు. కానీ గణేష్‌ను నరబలి ఇచ్చేందుకు ప్రయత్నించారని, శరీరంపై కత్తులతో నరికిన ఆనవాళ్లు కూడా ఉన్నాయని అతడి కుటుంబసభ్యులు చెబుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని అసలేం జరిగిందన్న విషయంపై విచారణ చేస్తున్నారు. కాగా తనకు ఏదీ గుర్తులేదని గణేష్ చెబుతున్నాడు.
Read This Story Also:నెల్లూరులో చేతబడి కలకలం.. ప్రేమించి పెళ్లిచేసుకున్నాడని..!