జషిత్‌ను మళ్లీ కిడ్నాప్ చేస్తానంటూ ఓ వ్యక్తి చేసిన ఫోన్ కాల్ కలకలం రేపింది. ఈ నెల 19, 20 తేదీల్లో నరేష్ నాయుడు అనే వ్యక్తి జషిత్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి.. గతంలో జషిత్‌ను కిడ్నాప్ చేసింది తానేనని.. ఇప్పుడు రూ.50వేలు ఇవ్వకపోతే మళ్లీ బాలుడిని కిడ్నాప్ చేస్తానంటూ బెదిరించాడు. దీంతో అతడికి డబ్బులు ఇచ్చేందుకు జషిత్ కుటుంబసభ్యులు సిద్దమయ్యారు.
అయితే ముందుగా అప్రమత్తమైన జషిత్ మేనమామ ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అప్రమత్తమైన వారు గురువారం మధ్యాహ్నం మండపేట బైపాస్‌రోడ్డులో ఉన్న ఏడిదరోడ్డు జంక్షన్ వద్ద డబ్బులు తీసుకునేందుకు వచ్చిన నరేష్ నాయుడును పట్టుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్‌ను తరలించి, కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. కాగా గత నెల 22న మండపేట పట్టణానికి చెందిన నాలుగేళ్ల జషిత్ కిడ్నాప్ తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. ఆ తరువాత నాలుగు రోజుల తరువాత జషిత్‌ను కిడ్నాపర్లు క్షేమంగా తూర్పోగోదావరి జిల్లా కుతుకులూరు రోడ్‌లో వదిలేసి వెళ్లిన విషయం తెలిసిందే.