Andhra Pradesh Weather alert: ఐఎండి వాతావరణ సూచనల ప్రకారం తూర్పు మధ్య, ఈశాన్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడిందని, అది వాయువ్య దిశగా పయనించి 48 గంటల్లో ఉత్తర ఒడిశా – పశ్చిమబెంగాల్ తీరం వెంబడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని విపత్తుల శాఖ కమిషనర్ కె. కన్నబాబు వెల్లడించారు. దీని ప్రభావంతో రాగల 2 రోజుల పాటు ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు, మిగిలిన చోట్ల మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఫలితంగా పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరం వెంబడి గంటకు 55 – 65 కీమీ వెగంతో గాలులు వీస్తాయని, ఆ తీరం వెంబడి మత్స్యకారులు ఆదివారం నుంచి మంగళవారం వరకు వేటకు వెళ్ళరాదని కన్నబాబు జాలర్లను హెచ్చరించారు.
ఇక, రాగల 24 గంటల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఈ నెల 12, 13 తేదీల్లో ఉత్తర కోస్తా, ఉభయ గోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు వివరించారు.