రాకాసి అలల ధాటికి మత్స్యకారుల బోటు బోల్తా.. ఒకరు సేఫ్.. మరో ఆరుగురి కోసం..

విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి చేపల వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారుల బోటు సముద్రంలో అలల తాకిడికి బోల్తా పడింది. ఈ ఘటనలో ఒక మత్స్యకారుడు సురక్షితంగా బయటపడగా, మరో ఆరుగురి కోసం నేవీ, కోస్ట్‌గార్డ్, మెరైన్ పోలీసుల సంయుక్త బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. మత్స్యకారుల కుటుంబాలు ఆందోళనలో ఉండగా, ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టింది.

రాకాసి అలల ధాటికి మత్స్యకారుల బోటు బోల్తా.. ఒకరు సేఫ్.. మరో ఆరుగురి కోసం..
Visakhapatnam Boat Accident

Updated on: Jul 05, 2026 | 10:11 AM

విశాఖ సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు కొనసాగుతోంది. నేవీ, మెరైన్, కోస్ట్‌గార్డ్ టీమ్‌ల రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహిస్తున్నాయి. విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ నుంచి ఈనెల 1న చేపల వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో చిక్కుకున్నారు. దీంతో.. అలర్ట్‌ అయిన అధికారులు.. వారి జాడ కోసం సముద్ర తీరంలో గాలిస్తున్నారు. అయితే.. సముద్రంలో అలల తాకిడికి మత్స్యకారుల బోటు బోల్తా పడినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో మత్స్యకారుడు కారె చిన్న సేఫ్ గా బయటపడ్డాడు.. మరో షిప్‌లో కారె చిన్నకు ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. మరో ఆరుగురి కోసం గాలింపు కొనసాగుతోంది..ఒక మత్స్యకారుడు సేఫ్ గా ఉన్నట్టు ఎమ్మెల్యే వంశీకృష్ణకు సమాచారం అందింది.. ఈ విషయాన్ని ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ ఘటనపై మంత్రి అచ్చెన్నాయుడు కూడా ఆరా తీశారు. విశాఖ కలెక్టర్, ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. యుద్ధప్రాతిపదికన గాలింపు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు.

తల్లడిల్లితున్న కుటుంబాలు..

ఇక.. అటు.. మత్స్యకారుల కుటుంబాలు తల్లడిల్లిపోతున్నాయి. తమవారి జాడ ఎక్కడ అంటూ కన్నీరుమున్నీరు అవుతున్నాయి. నిన్న మధ్యాహ్నం 2గంటలు, 3గంటల సమయంలో ఫోన్లు చేసిన జాలర్లు.. 4గంటలకు తీరానికి చేరుకుంటామని చెప్పారు. అయితే.. ఫిషింగ్‌ హార్బర్‌కు చేరుకోకపోవడంతో మత్స్యకారులకు ఫోన్లు చేయగా.. అందరి ఫోన్లు స్విచ్చాఫ్‌ అయ్యాయి. దీంతో.. వారి కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. గంటలు గడుస్తున్నా ఆచూకీ లభించకపోవడంతో అల్లాడిపోతున్నారు. ఎక్కడున్నారో.. ఏమయ్యారోనంటూ గుండెలు బాదుకోవడం కలసివేస్తోంది. తమ కుటుంబాలకు వాళ్లే దిక్కు అంటూ రోదిస్తున్నారు.

విశాఖ హార్బర్‌ నుంచి చేపలవేటకు..

సముద్రంలో చిక్కుకున్నవారిలో అప్పలరాజు, బండియ్య, గరగయ్య, సీతుడు, చిన్నఅమ్మోరు, చిన్నయ్య అనే మత్స్యకారులు ఉన్నారు. మత్స్యకారుల ఆచూకీ కోసం అధికారులు ముమ్మరంగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. వీరిలో చిన్నా ఆచూకీ మాత్రమే లభించింది.

Follow Us