ఓ వ్యక్తికి ఏదైనా పెద్ద దొంగతనం చేయాలనిపించింది. అలా ఆలోచిస్తున్నంతలోనే ఎదురుగా బస్టాప్‌లో ఉన్న ఆర్టీసీ బస్సు కనిపించింది. అంతే వెనుకా, ముందు ఆలోచించకుండా డ్రైవర్ సీట్లో కూర్చొని ఆ బస్సును డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాడు. తీరా మార్గమధ్యంలో వెళ్లాక లారీని ఢీకొట్టి, ఆ బస్సును అక్కడే వదిలేసి పరారయ్యాడు. అయితే ఆ సమయంలో ఆ బస్సులో ప్రయాణికులు కూడా ఉండటం కొసమెరుపు. చదివేందుకు కాస్త ఆసక్తిని పుట్టిస్తోన్న ఈ సంఘటన ఎక్కడో కాదు తెలంగాణలోని వికారాబాద్ జిల్లా తాండూరులో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. తాండూరు డిపోకు చెందిన ఓ బస్సు ఆదివారం రాత్రి కరణ్‌కోట్ నైట్‌హోల్డ్ బయల్దేరడానికి బస్టాప్‌లో నిలిపి ఉంది. డ్రైవర్, కండక్టర్ భోజనానికి వెళ్లారు. అప్పటికే ప్రయాణికులు బస్సులో ఎక్కి కూర్చున్నారు. అంతలో ఓ గుర్తు తెలియని వ్యక్తి బస్సును స్టార్ట్ చేశాడు. కండక్టర్ రాకుండానే బస్సును ఎలా స్టార్ట్ చేస్తావని ప్రయాణికులు ప్రశ్నించగా.. దీనికి నేనే డ్రైవర్, నేనే కండక్టర్ అంటూ మాట్లాడి.. బస్టాప్ నుంచి రయ్‌మంటూ తీసుకెళ్లాడు. ఆ తరువాత మల్లప్పమడిగ దగ్గరకు వెళ్లగానే ఓ లారీని ఢీకొట్టాడు. ఇక ఆ భయంతో నడిరోడ్డు మీదే బస్సును వదిలేసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఇక ఈ సంఘటన నుంచి కాస్త తేరుకున్న ప్రయాణికులు డిపో మేనజర్‌కు సమాచారం ఇచ్చారు. ఆ తరువాత బస్సును తిరిగి డిపోకు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. అయితే మద్యంలో ఉండటం వల్లనే ఆ వ్యక్తి ఈ చర్యకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. కాగా గతంలోనూ తెలంగాణలో ఓ ఆర్టీసీ బస్సును అపహరించిన దుండగులు.. అందులో ప్రధాన భాగాలన్నీ తీసుకొని వేరే ప్రదేశంలో వదిలేసిన విషయం తెలిసిందే.