APPSC సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. డిగ్రీ పాసైతే చాలు! నెలకు రూ.లక్షన్నర జీతం
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు కూటమి సర్కార్ వరుస నోటిఫికేషన్లు జారీ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది...

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు కూటమి సర్కార్ వరుస నోటిఫికేషన్లు జారీ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 17 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 29, 2026లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ ద్వారా రెండు విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు 11, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు 6 వరకు ఉన్నాయి.
అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ లేదా దానికి సమానమైన అర్హత కలిగి ఉండాలి. దరఖాస్తు చేసుకునే ముందు సంబంధిత పోస్టుకు నోటిఫికేషన్‌లో పేర్కొన్న అదనపు అర్హతలు, నిబంధనలను పరిశీలించాలి. అభ్యర్ధుల వయోపరిమితి 2026 జూలై 1 నాటికి అభ్యర్థుల వయసు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు, మాజీ సైనికులు, ఎన్‌సీసీ ఇన్‌స్ట్రక్టర్లు, అర్హులైన ప్రభుత్వ ఉద్యోగులకు నిబంధనల ప్రకారం సడలింపు వర్తిస్తుంది. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో అక్టోబర్ 29, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.48,440 నుంచి రూ.1,37,220 వరకు వేతన శ్రేణి వర్తిస్తుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర వర్తించే అలవెన్సులు, ప్రయోజనాలు అందే అవకాశం ఉంటుంది.
ఎంపిక విధానం ఇలా..
అభ్యర్థుల ఎంపిక ప్రధానంగా కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (CBRT) ద్వారా జరుగుతుంది. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (CPT) నిర్వహిస్తారు. రాత పరీక్షలో సాధించిన మెరిట్, నిర్దేశిత అర్హతలు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య అర్హత తదితర నిబంధనల ఆధారంగా తుది ఎంపిక చేపడతారు. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలో మొత్తం మూడు పేపర్లకు ఉంటుంది. పరీక్ష మొత్తం 450 మార్కులకు నిర్వహిస్తారు.
- పేపర్-1లో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ – 150 మార్కులు
- పేపర్-2లో సంబంధిత సబ్జెక్టు – 150 మార్కులు
- పేపర్-3లో సంబంధిత సబ్జెక్టు – 150 మార్కులు
ప్రతి తప్పు సమాధానానికి సంబంధిత ప్రశ్నకు కేటాయించిన మార్కుల్లో మూడో వంతు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు పరీక్షకు సిద్ధమయ్యేటప్పుడు సిలబస్‌తో పాటు పరీక్ష విధానం, మార్కుల కేటాయింపుపై అవగాహన పెంచుకోవాలి. దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.250, పరీక్ష ఫీజు కింద రూ.120 ప్రతి ఒక్కరూ దరఖాస్తు సమయంలో చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, మాజీ సైనికులు, అర్హులైన నిరుద్యోగ అభ్యర్థులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంవొ. పూర్తి ఫీజు నిబంధనలను అధికారిక నోటిఫికేషన్‌లో పరిశీలించాలి. అభ్యర్థులు చివరి తేదీ వరకు వేచి చూడకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవడం మంచిది.
