
అమరావతి, మే 29: రాష్ట్రంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ 2026 ఫలితాల విడుదల వాయిదా పడింది. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 1న ఫలితాలను విడుదల చేయాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల ఫలితాల విడుదల ప్రక్రియను వాయిదా వేశారు. ఈ క్రమంలో ఉన్నత విద్యామండలి కొత్త తేదీని ప్రకటించింది. తాజా షెడ్యూల్ ప్రకారం జూన్ 18 తర్వాత ఈఏపీసెట్ ఫలితాలు ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఇంప్రూవ్‌మెంట్ అవకాశం కల్పించిన నేపథ్యంలో ఈఏపీసెట్ ఫలితాల విడుదలను వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాతే ఈఏపీసెట్ ర్యాంకులను విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఏపీ ఈఏపీసెట్ 2026 ఫలితాల పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఈఏపీసెట్‌లో ఇంటర్మీడియట్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉండటంతో, సప్లిమెంటరీ ఫలితాల తర్వాత ర్యాంకుల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఈ కారణంగా విద్యార్థుల్లో గందరగోళం తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాల విడుదలపై బుధవారం జరిగిన సమీక్ష సమావేశంలో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ పాల్గొన్నారు. సప్లిమెంటరీ పరీక్షల మూల్యాంకనాన్ని వేగవంతం చేసి సాధ్యమైనంత త్వరగా ఫలితాలు విడుదల చేయాలని ఇంటర్మీడియట్ విద్యామండలికి ఆయన ఆదేశాలు జారీ చేశారు.
కాగా ఈ ఏడాది ఇంటర్ సెకండ్ ఇయర్ ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1.50 లక్షల మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ఇందులో ఒక్క గణితం సబ్జెక్టుకే ఏకంగా లక్ష మందికి పైగా విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. జూన్ 5తో ఈ పరీక్షలు ముగియనున్నాయి. అనంతరం దాదాపు 13 రోజులపాటు మూల్యాంకన ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తానికి జూన్ 18 తర్వాత ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల చేసి, ఆపై ఈఏపీసెట్ ర్యాంకులు విడుదల చేయనున్నారు.
ఏపీ ఈఏపీసెట్ 2026 ఫలితాల పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.