Minister Kishan Reddy: విశాఖలోని సీతమ్మధార క్షత్రియ కళ్యాణ మండపంలో అల్లూరి సీతారామరాజు (Alluri Sitarama Raju)వర్థంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా, ఎంపీ ఎంవీవి, ఎమ్మెల్సీలు కల్యాణి, మాధవ్, మేయర్ హరి వెంకటకుమారి హాజరై అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మంత్రి కిషన్‌రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. అల్లూరిని స్మరించుకోవడం మన అదృష్టం.. తెలుగు వాడిగా గర్వపడుతున్నాను.. నా జీవితంలో ఎక్కువ సార్లు చూసిన సినిమా అల్లూరి సీతారామరాజు అని అన్నారు. భారత దేశం మొత్తం అల్లూరిని పరిచయం చేస్తాను.. అల్లూరి 125 వ జయంతి ఉత్సవాలను దేశ వ్యాప్తంగా నిర్వహిస్తాం.. ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేశానని అన్నారు. భీమవరంలో వచ్చే నెలలో జరిగే అల్లూరి స్మారక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొంటారని, అల్లూరి ఒక కులానికి మతానికో ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదని, తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు అల్లూరిని అభిమానించే కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.
అన్ని తరాల వారికి అల్లూరి చరిత్ర అందించాలని, భారతీయులకు అన్నింటికంటే దేశం ముఖ్యం.. ముఖ్యమైన పండుగ ఆగస్టు 15. ఈ ఏడాది ఆగస్టు 15న అందరి ఇళ్లపై జాతీయ జెండా ఎగరాలి.. కుటుంబ సభ్యులతో జాతీయ పండుగ జరుపుకోవాలి.. ప్రతి ఇంట్లో జాతీయ గీతం పాడాలని అన్నారు. వందేమాతరం నినాదంతో బ్రిటిషు వారికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు సాగించిన గొప్ప విప్లవకారుడు, గిరిజనుల హక్కుల కోసం పోరాడిన మన్యం వీరుడు, భరతమాత బానిస సంకెళ్ళు తెంచటానికి తన జీవితాన్ని త్యాగం చేసిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు.
అనంతరం ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా మాట్లాడుతూ.. అల్లూరి సీతారామారాజు పేరు మీద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొత్త జిల్లాను ఏర్పాటు చేశారని, ఆయన ఆశయ సాధనకు జగన్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి: