వాళ్ళిద్దరూ స్నేహితులు..! కాయ్ రాజా కాయ్ అంటూ ఆకర్షించే వారికి ఎట్రాక్ట్ అయ్యారు. ఐపిఎల్ బెట్టింగుల్లో పాల్గొని అప్పుల పాలయ్యారు. ఇక చెప్పేదేముంది..? చేతికి పని చెప్పి.. ఓ షాపును గుల్ల చేశారు. అంతేకాదు.. చోరీ చేసిన సొత్తును.. ఏకంగా నేపాల్ లో విక్రయించాలని స్కెచ్ వేసుకున్నారు. ఇంతలో పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు. ఇంతకీ విశాఖలో చోరీ చేసిన సొత్తును నేపాల్ లోనే ఎందుకు విక్రయించాలని అనుకున్నారో తెలుసుకుందాం పదండి. పైన ఫోటోలో కనిపిస్తున్న వాళ్లలో ఒకడి పేరు గాలిబ్, మరొకడు ముస్తాఫిర్. గాలిబ్ తండ్రి గాజువాకలో బ్యాగుల షాపు నిర్వహిస్తున్నాడు. బీహార్ కు చెందిన ముస్తాఫిర్.. విశాఖకు మకాం మార్చాడు. కుటుంబ సభ్యులతో గొడవపడిన ముస్తాఫిర్.. గాలిబ్ ఇంట్లోనే ఉంటున్నాడు. గాలిబ్, ముస్తాఫిర్ ఇద్దరూ జత కలిశారు. జల్సాలకు అలవాటు పడి అప్పులు కూడా చేశారు. వాటి నుంచి గట్టెక్కేందుకు ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ లో పాల్గొన్నారు. డబ్బులు పోతున్నప్పటికీ.. ఏదో ఒక రోజు లక్ కలిసి వస్తుందని అనుకుని ముందుకే సాగారు. దీంతో లక్షల రూపాయలు అప్పులు చేసేసారు. ఆదాయం లేదు. అప్పులు చూస్తే తడిసి మోపెడు..! దీంతో ఇక ఏం చేయాలా అని కూర్చుని ఆలోచించి.. చేతివాటం చూపాలని నిర్ణయించుకున్నారు.
ఎక్కడ చోరీ చేయాలా అని ఆలోచించి.. ఎక్కడో ఎందుకు..? గాజువాకలో గాలిబు తండ్రి నిర్వహిస్తున్న బ్యాగుల షాపు ఎదుట ఉండే మొబైల్ షాప్ పై కన్నేశారు. ఖరీదైన మొబైల్స్ విక్రయించే.. హ్యాపీ మొబైల్ షాప్ గుళ్ళ చేయాలని స్కెచ్ వేశారు. ఈనెల 24వ తేదీ రాత్రికి ముహూర్తం ఖరారు చేసి.. ఎంటర్ అయిపోయారు. ముందుగా సీసీ కెమెరాలో ఎక్కడెక్కడ ఉన్నాయా అని గుర్తించారు. షాపు వెనుక వైపు కొత్తగా నిర్మిస్తున్న భవనం రెండో అంతస్తు పైకెక్కి మొబైల్ షాపులోకి ఎంటర్ అయ్యారు. వెనుక వైపు నుంచి తలుపు తీసి.. సీసీ కెమెరాల వైర్లు కత్తిరించారు. ఆ తర్వాత షాపులో ఉన్న 53 ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లు, 23 రకాల యాక్సెసరీస్, 21 వేల నగదు తో పాటు.. వెళ్తూ వెళ్తూ సీసీ కెమెరా రికార్డు అయ్యే డివిఆర్ ను కూడా ఎత్తుకుపోయారు. చోరీ చేసిన సొత్తంతా మూట కట్టుకున్న గాలిబ్, ముస్తాఫిర్.. వాటిని లోకల్‌గా విక్రయించకూడదని నిర్ణయించారు. ఏకంగా నేపాల్ కు వెళ్లి అక్కడ ఈజీగా సేల్ చేసి సొమ్ము చేసుకోవాలని అనుకున్నారు. ఎందుకంటే ముస్తాఫిర్.. స్వగ్రామం బీహార్ మారుమూల ప్రాంతంలో ఉంది. అక్కడికి నేపాల్ బోర్డర్ కేవలం ఐదు కిలోమీటర్ల దూరమే. ఈజీగా బోర్డర్ క్రాస్ చేసి.. అక్కడ ఈ ఫోన్లు అమ్మి సొమ్ము చేసుకోవాలని అనుకున్నారు. ఎందుకంటే.. బోర్డర్ క్రాస్ అయితే ఆ మొబైల్స్ ను పట్టుకోవడం పోలీసుల తరం కాదు. ఇదే మంచి ఐడియా అనుకోని.. బీహార్ కు చెక్కేసేందుకు సిద్ధమయ్యారు.
ఈలోగా విశాఖ పోలీసుల చేతికి చిక్కిపోయారని అన్నారు క్రైమ్ డిసిపి నాగన్న. ఇదీ.. ఈ చోర్ ఫ్రెండ్స్ క్రైమ్ కథ..! బెట్టింగులకు అలవాటు పడి ఉన్నదంతా పోగొట్టుకొని.. చివరకు చోరీలు… ఆపై నేపాల్‌కు చెక్కేద్దామని.. పోలీసులకు చిక్కి.. కటకటాల పాలయ్యారు. ఇంతలా కష్టపడి జైలుకెళ్లే ముందే.. కాస్త ఆలోచించి వ్యసనాలకు దూరంగా ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు కదా..!.
ఖాజా, వైజాగ్
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి