Visakhapatnam: రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ రద్దు చేయలేదు.. తాత్కాలికం మాత్రమే.. ప్రభుత్వ వర్గాల వివరణ

Rushikonda Beach: బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది అంతర్జాతీయ పర్యావరణ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న బీచ్‌లకు ఇచ్చే అత్యంత ప్రతిష్టాత్మకమైన గుర్తింపు. దీన్ని డెన్మార్క్‌లోని ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ ఎడ్యుకేషన్ (FEE) ద్వారా అందజేస్తారు. ఈ గుర్తింపు పొందడానికి బీచ్ పర్యావరణ పరిరక్షణ..

Visakhapatnam: రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ రద్దు చేయలేదు.. తాత్కాలికం మాత్రమే.. ప్రభుత్వ వర్గాల వివరణ

Edited By: Subhash Goud

Updated on: Mar 02, 2025 | 9:19 PM

విశాఖలోని రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ రద్దు చేయబడిందని చెప్పడం తప్పనీ, ఇది కేవలం తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రభుత్వ వర్గాలు వివరణ ఇచ్చాయి. ప్రధానంగా రద్దీ నియంత్రణ, ట్రాఫిక్ సమస్యల కారణంగా తాత్కాలికంగా ఉపసంహరించుకున్నారనీ, మార్చి 4, 2025న జరగనున్న భద్రతా ఆడిట్ (RLSS) అనంతరం బ్లూ ఫ్లాగ్ తిరిగి మంజూరు కానుందనీ వివరించారు.

జనవరి 2025లో బ్లూ ఫ్లాగ్ ఇండియా నేషనల్ ఆపరేటర్ రుషికొండ బీచ్‌లో కొందరి రద్దీ నియంత్రణ, ట్రాఫిక్ సమస్యలు ఉన్నట్లు గుర్తించి, ఈ అంశాలను తక్షణమే పరిష్కరించాల్సిందిగా సూచించారు. భద్రతా పరంగా ప్రత్యేక మార్గాలు, సెక్యూరిటీ పెంచడం, చెత్త, వ్యర్థాల నిర్వహణలో మెరుగుదల
అసహాయ శునకాలను నియంత్రించే చర్యలు, పరిస్థితుల సమీక్ష కోసం సంబంధిత నిపుణులు, సంస్థలతో సంప్రదింపులు చేస్తున్నట్టు ప్రభుత్వం వివరించింది.

జనవరి 9, 2025న అధికారికంగా బ్లూ ఫ్లాగ్ ప్రదానం:

2024-25 బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్‌ను 2025 జనవరి 9న అహ్మదాబాద్‌లోని థల్తేజ్ టేక్రా, CEE క్యాంపస్‌లో జరిగిన కార్యక్రమంలో బ్లూ ఫ్లాగ్ నేషనల్ ఆపరేటర్ – ఇండియా, ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ అధికారులకు అందజేశారు.

రుషికొండ బీచ్ ప్రత్యేకత – అధిక సందర్శకుల రద్దీ

ఇతర బ్లూ ఫ్లాగ్ బీచ్‌లతో పోలిస్తే రుషికొండ బీచ్‌కు అధిక సందర్శకుల ప్రవాహం ఉంటుంది. ఆర్కే బీచ్‌తో పోలిస్తే రుషికొండ బీచ్ ప్రశాంతమైన సముద్ర తీరంగా ఉండటంతో ఎక్కువ మంది యాత్రికులు ఇక్కడికి రావడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రతి నెల సీజన్లో 70,000 – 1,00,000 మంది సందర్శకులు ఇక్కడికి వస్తున్నారు. వారాంతాల్లో, పండగల సమయంలో పర్యాటకుల సంఖ్య మరింతగా పెరుగుతుంది.

జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం:

ఫిబ్రవరి 17, 2025న జిల్లా కలెక్టర్, రుషికొండ బీచ్ మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్ నేతృత్వంలో సమీక్షా సమావేశం జరిగింది. GVMC, ఫారెస్ట్, అగ్నిమాపక, పోలీస్, ఫిషరీస్, VMRDA వంటి శాఖల అధికారులకు రుషికొండ బీచ్ ప్రతిష్ఠకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ప్రస్తుతం చేపడుతున్న చర్యలు

  • VMRDA కొత్త పార్కింగ్ వసతి నిర్మాణం (70% పని పూర్తి)
  • GVMC వ్యర్థాల నిర్వహణ, హరిత పర్యావరణ అభివృద్ధి
  • పోలీస్ శాఖ అదనపు సిబ్బందిని నియమించి జనసందోహాన్ని నియంత్రిస్తోంది
  • APTDC అదనపు మరుగుదొడ్లు నిర్మాణం, వాకింగ్ పథుల మరమ్మతులు చేపడుతోంది
  • బీచ్ నిర్వహణ కోసం ప్రత్యేక ఆపరేటర్‌ను నియమించేందుకు APTDC చర్యలు తీసుకుంటోంది

బ్లూ ఫ్లాగ్ నేషనల్ ఆపరేటర్ సూచించిన సిఫార్సులను త్వరలోనే పూర్తి చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. మార్చి 2025లో రుషికొండ బీచ్ తిరిగి బ్లూ ఫ్లాగ్‌ను ఎగురవేయనుందనీ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్ ఘనత:

విశాఖపట్నంలోని రుషికొండ బీచ్ మరోసారి బ్లూ ఫ్లాగ్ గుర్తింపు పొందడం రాష్ట్రానికి గర్వకారణం. భారతదేశంలోని 12 బ్లూ ఫ్లాగ్ బీచ్‌లలో ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఘనత సాధించిన ఏకైక బీచ్ రుషికొండ. 2020లో మొదటిసారిగా బ్లూ ఫ్లాగ్ గుర్తింపు పొందిన రుషికొండ బీచ్ 2024-25 సంవత్సరానికిగాను అక్టోబర్ 2024లో మరోసారి ఈ అంతర్జాతీయ గుర్తింపును పొందింది.

బ్లూ ఫ్లాగ్ గుర్తింపు

బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ అనేది అంతర్జాతీయ పర్యావరణ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న బీచ్‌లకు ఇచ్చే అత్యంత ప్రతిష్టాత్మకమైన గుర్తింపు. దీన్ని డెన్మార్క్‌లోని ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ ఎడ్యుకేషన్ (FEE) ద్వారా అందజేస్తారు. ఈ గుర్తింపు పొందడానికి బీచ్ పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛత, నీటి నాణ్యత, సురక్షితమైన స్థిరమైన పర్యాటక విధానాలు, వృథా నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ చర్యల వంటి కఠినమైన ప్రమాణాలను పాటించాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి