
మనం వాడేసిన సెకండ్ హ్యాండ్ వస్తువులను అమ్మడానికి, కొనడానికి సాధారణంగా ఓఎల్ఎక్స్ లాంటి యాప్‌లు ఉపయోగిస్తుంటాం.. సెల్‌ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లు, ఫర్నీచర్, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఒకటేమిటి రకరకాల సెకండ్ హ్యాండ్ వస్తువులను ఆన్‌లైన్లో అమ్మేస్తుంటాం.. అయితే అప్పుడప్పుడు ఆ సైట్‌లో కొన్ని వింత వస్తువులు అమ్మకానికి వస్తుంటాయి.. వాటిని ఆకతాయితనంతో పెడతారో.. లేక విసిగి వేసారి తమ ఆక్రోశాన్ని వ్యక్తపరచడానికి పెడతారో అర్ధంకాదు.. ఇలాంటి ఘటనే ప్రకాశంజిల్లాలో చోటు చేసుకుంది.
ప్రకాశంజిల్లా గిద్దలూరు తహసీల్దార్ కార్యాలయం అమ్మకానికి ఉందంటూ ఓ వ్యక్తి OLXలో పోస్ట్ పెట్టాడు. అది కూడా కేవలం రూ. 20 వేలకే కొనుగోలు చేయవచ్చని తెలిపాడు.. వినడానికి, చూడటానికి వింతగా ఉన్నా ఇప్పుడు ఈ పోస్టింగ్ ఓఎల్‌ఎక్స్‌లో హల్‌చల్ చేస్తోంది. ప్రభుత్వ కార్యాలయం అమ్మకానికి పెట్టడం ఏంటి అని అనుకుంటున్నారా. అవును కార్యాలయం ఫోటోని యాప్ లో అప్లోడ్ చేసి 20 వేల రూపాయలకు అమ్ముతున్నట్లు పోస్ట్‌లో పేర్కొన్నాడు.
గత రెండు రోజులుగా ఈ ఫోటో ఓఎల్ఎక్స్ లో చక్కర్లు కొడుతూ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ పోస్టింగ్‌పై సమాచారం అందుకున్న గిద్దలూరు రెవెన్యూ అధికారులు ఖంగుతిన్నారు. వెంటనే తేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు గిద్దలూరు తహసీల్దార్ ఆంజనేయరెడ్డి.. తహాసీల్దార్ ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఈ ఘటనపై స్పందించేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారు. గిద్దలూరు తహసీల్దార్ కార్యాలయంలో పనుల కోసం వచ్చి విసిగి వేసారిన ఎవరైనా ఈ పోస్టింగ్ పెట్టారా.. లేక ఆకతాయితనం ప్రదర్శించారా.. అన్నది పోలీసుల విచారణలో తేలనుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.