
Visakha Steel Plant Privatisation: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్‌పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. స్టీల్ ప్లాంట్ విషయంలో పార్లమెంట్ లోపల, వెలుపలా పోరాడుతూనే ఉన్నామని చెప్పారు. ఈ విషయంలో తమ పార్టీ చాలా క్లారిటీతో ఉందన్నారు. మంగళవారం నాడు ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. గతంలో చంద్రబాబు నాయుడు 56 కంపెనీలను ప్రైవేటీకరించాలని చూస్తే ఆనాడు వైఎస్ఆర్ వ్యతిరేకించారని గుర్తుచేశారు. ఇప్పుడు కూడా స్టీల్ ప్లాంట్ విషయంలో పోరాటం చేస్తున్నామని పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ రునాలను ఈక్విటీ కింద మారిస్తే ఆరె నెలల్లో స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి వస్తుందన్నారు. ఈ విషయాన్ని వైసీపీ బలంగా నమ్ముతోందన్న ఆయన.. కేంద్రం మాత్రం వినడం లేదన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్‌కు వ్యతిరేకంగా 13 కార్మిక సంఘాలు చేస్తున్న పోరాటానికి సంఘీభావం ప్రకటిస్తున్నామని విజయసాయిరెడ్డి తెలిపారు. కార్మిక సంఘాలు మూడు డిమాండ్ల్ చేశాయన్న ఆయన.. సీఎంతో అతి త్వరలో కార్మిక సంఘాలను కలిపిస్తామన్నారు. అసెంబ్లీలో తీర్మానం చేసేలా చర్యలు చేపడతామన్నారు. మోదీని కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నామని విజయసాయి వివరించారు. అది కాకుండా ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయోజనాలు కాపాడేందుకు ‘స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట యాత్ర’ చేయపడతామని ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అన్ని నియోజకవర్గాలను కలుపుకుని వెళ్తామన్నారు. 23 కిలో మీటర్లు ఈ పాదయాత్ర కొనసాగుతుందని వెల్లడించిన విజయసాయి.. విశాఖ నుంచి ఢిల్లీకి వినిపించేలా పాదయాత్ర చేపడతామన్నారు. తాము చేపట్టే పాదయాత్రకు రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేదని విజయసాయి స్పష్టం చేశారు. పాదయాత్రను రాజకీయాలతో ముడిపెట్టొద్దన్న ఆయన.. ఎస్ఈసీ నిమ్మగడ్డకు దీనితో సంబంధం లేదన్నారు.
ఇదిలాఉంటే.. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై ఎంపీ విజయసాయి రెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబులా తమకు డ్రామాలాడటం రాదన్నారు. చంద్రబాబు నాటకాలను ఎవరూ నమ్మొద్దన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. తాము పిలిచిన అఖిలపక్షానికి టీఎన్ టీయూసీ రాలేదన్నారు. వారి నుంచి స్పందనే రాలేదని విమర్శించారు. బీజేపీతో చంద్రబాబు ప్రేమ కలాపాలు సాగించేలా పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. సీఎం జగన్‌కు లేఖ రాసిన చంద్రబాబు.. ప్రధాని నరేంద్ర మోదీకి ఎందుకు రాయలేదని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు.
ఇక స్టీల్ ప్లాంట్ నష్టాలపై స్పందించిన విజయసాయి రెడ్డి.. సంస్థకు సీఎండీగా పని చేసిన చాంద్ దుర్వినియోగానికి పాల్పడ్డారని తెలిసిందన్నారు. దీంతోపాటు స్టీల్ ప్లాంట్‌కు నష్టాలకు అనేక కారణాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. స్టీల్ ప్లాంట్‌లో ఉన్న ఒడిశా ఉన్నతాధికారులు కూడా దీనిపై ప్రభావం చూపుతున్నారని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు.
Also read:
Madhya Pradesh Accident: మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. నదిలోకి దూసుకెళ్లిన బస్సు.. 28 మంది దుర్మరణం