సామాన్యుల సొత్తును దొంగలు దోచుకుంటుంటే.. వారి దగ్గర్నుంచి పోలీసులు దోచుకుంటున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఐదుగురు పోలీసుల సస్పెన్షన్ సంచలనం రేపుతోంది. మధిర నుంచి ఛత్తీస్‌గఢ్‌కు మిర్చిలోడుతో వెళ్లి అక్కడ పంటను అమ్ముకుని తిరిగి వస్తుండగా లారీ డ్రైవర్ నుంచి పాతిక లక్షల దోపిడీ జరిగింది. నిజానికి ఈ సొమ్మును దోచేసింది క్లీనరే. ఛత్తీస్‌గఢ్ నుంచి తిరిగి వస్తుండగా.. పాల్వంచ వద్ద క్లీనర్ కోటేశ్వరరావు తనకు కడుపునొప్పిగా ఉందని మాయమాటలు చెప్పి.. పాతిక లక్షలు తీసుకుని దిగిపోయాడు. డ్రైవర్ ఖయ్యుం జొన్నలగడ్డ దగ్గరకు వచ్చాక డబ్బు కోసం వెతకగా.. పెట్టిన చోట లేవు. దీంతో నందిగామ పోలీసులను ఆశ్రయించాడు. ఇక అక్రమ ఇసుక తరలింపును అడ్డుకునేందుకు పోలీసులు చెక్‌పోస్టులు పెట్టి వెతుకుతుండగా… ఓ ఆటోలో వెళ్తున్న క్లీనర్ కోటేశ్వర్ రావు దిగి పారిపోబోయాడు. అతడిని చెక్ చేయగా.. బ్యాగులో డబ్బు దొరికింది. విచారించగా.. అప్పటికే పోలీసులకు ఫిర్యాదు అందడంతో డబ్బు రికవర్ చేసి.. బాధితులకు అప్పగించారు. కాని ఇక్కడే పోలీసులు కక్కుర్తి పడ్డారు.
నందిగామ పీఎస్‌కు చెందిన ఐదుగురు కానిస్టేబుల్స్ నిందితుడి నుంచి ఆరు లక్షలు నొక్కేశారు. పాతిక లక్షల్లో ఆరున్నర లక్షలు తీసుకుని.. 18.5 లక్షలే రికవర్ అయినట్లు అధికారులకు చెప్పారు. ఈ విషయం నిందితుడి విచారణలో బయటపడింది. దీంతో పోలీసు అధికారులు విజయవాడ సీపీకి ఫిర్యాదు చేయగా.. ఎఆర్ ఎఎస్సై రుద్రరాజు, కానిస్టేబుల్ అరుణ్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ నాగరాజు, సివిల్ పోలీసులు సృజన్, శివను సస్పెండ్ చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..