నందిగామ నియోజకవర్గంలో పర్యటించిన టీడీపీ ఎంపీ కేశినేని నాని.. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్‌రావు, అతని సోదరుడు ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌లపై ప్రశంసల జల్లు కురిపించడం.. స్థానికంగా ఉన్న టీడీపీ నేతలకు మంట పుట్టించింది. నందిగామ నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలు, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తదితరులు పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. నానిపై చర్యలు తీసుకోవాలని కోరారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల టీడీపీ అధ్యక్షులు, సౌమ్య ప్రత్యేకంగా సమావేశమై.. ఎంపీ నాని కావాలనే కామెంట్స్ చేస్తున్నారని మండిపడ్డారు.
మంచి పనులు ఎవరు చేసినా అభినందిస్తానన్నారు ఎంపీ కేశినేని నాని. ఎంపీ టికెట్ రాకపోతే కేశినేని భవన్లో కూర్చుని ప్రజలకు సేవ చేస్తానని ఆయన వెల్లడించారు. తాను, తన కుటుంబం జీవితాంతం రాజకీయాల్లో ఉండాలని భావించే వ్యక్తిని కాదన్నారు. ఇసుకలో వాటాలు, మైనింగ్‌లో వాటాలు ఇవ్వకపోతే బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేయడం తనకు అలవాటు లేదన్నారు.
మధ్యలో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రస్తావన తీసుకొచ్చిన ఎంపీ నాని.. బెజవాడ అభివృద్ధి కోసం తాను ముళ్లపందితోనైనా కలుస్తానన్నారు. మొత్తానికి కేశినేని నాని దూకుడు చూస్తే నందిగామ వ్యవహారం టీడీపీలో ముదిరేటట్టే కనిపిస్తోంది. మరి.. ఈ అంశంలో టీడీపీ అధిష్ఠానం దిద్దుబాటు చర్యలు చేపడుతుందో లేదో చూడాలి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..