AP News: కృష్ణలంక పీఎస్‌లో కొనసాగుతున్న క్వశ్చన్ అవర్.. వంశీపై ప్రశ్నల వర్షం

గన్నవరం టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్న సత్యవర్ధన్‌ను కిడ్నాప్‌ చేసి బెదిరించినట్లు వంశీపై ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న సత్యవర్ధన్‌.. ఇటీవల విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయ స్థానంలో హాజరై తనకు ఈ కేసుతో సంబంధం లేదంటూ అఫిడవిట్ సమర్పించారు. అయితే...

AP News: కృష్ణలంక పీఎస్‌లో కొనసాగుతున్న క్వశ్చన్ అవర్.. వంశీపై ప్రశ్నల వర్షం
Vallabhaneni Vamsi

Updated on: Feb 13, 2025 | 5:09 PM

కృష్ణలంకలో క్వశ్చన్ అవర్‌ కంటిన్యూ అవుతోంది. కిడ్నాప్, దాడి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో అరెస్టైన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని నాలుగు గంటలకు పైగా విచారిస్తున్నారు పోలీసులు. ఎందుకు…? ఏమిటి…? ఎలా…? అంటూ పదుల సంఖ్యలో ప్రశ్నలు సంధిస్తున్నారు. వంశీ కన్ఫెషన్‌ రికార్డ్‌ చేస్తున్నారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత వంశీని విజయవాడ ఎస్సీ-ఎస్టీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.

కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌ బయట జరిగిన హైడ్రామా మధ్య వంశీ భార్యను స్టేషన్‌లోకి అనుమతించారు పోలీసులు. ఇక వంశీనికి కలిసి బయటకొచ్చిన భార్య పంకజశ్రీ… కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీసులు కేసు వివరాలు చెప్పట్లేదంటున్నారు. రిమాండ్‌లోకి తీసుకున్నప్పుడు అన్నీ విషయాలు చెబుతామని సమాధానమిచ్చినట్లు వెల్లడించారు. ఇప్పటికీ ఎలాంటి FIR నమోదు కాలేదని తెలిపారు పంకజశ్రీ. అంతకుముందు స్టేషన్‌ బయట పోలీసులతో వాగ్వాదానికి దిగారు వైసీపీ నేతలు. ఏ కేసులో అరెస్ట్‌ చేశారో చెప్పాలంటూ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లాయర్లు సైతం పోలీసుల తీరును తప్పుబట్టారు.

ఇక కిడ్నాప్‌, దాడి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో BNS సెక్షన్లు 140(1), 308, 351(3), రెడ్‌విత్‌ 3(5) కింద వంశీపై కేసు నమోదు చేశారు పోలీసులు. వైసీపీ అధికారంలో ఉండగా గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులోనూ వంశీ A71గా ఉన్నారు.

ఫిబ్రవరి 13, గురువారం ఉదయం 5 గంటలకు హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని వంశీ ఇంటికి వెళ్లిన పడమట పోలీసులు…6గంటలకు ఆయన్ను అరెస్ట్ చేసి భార్యకు నోటీసులిచ్చారు. 7 గంటలకు గచ్చిబౌలి నుంచి విజయవాడకు బయల్దేరారు. 10 గంటల 45 నిమిషాలకు సూర్యాపేట దగ్గర బ్రేక్‌ఫాస్ట్‌ అనంతరం 12 గంటలకు విజయవాడ చేరుకున్నారు. 12 గంటల 45 నిమిషాలకు భవానీపురంలో వంశీని వేరే వాహనంలోకి ఎక్కించి కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఇక అప్పట్నుంచి విచారణ కొనసాగుతూనే ఉంది.

వల్లభనేని వంశీకి బెయిల్‌ వస్తుందా? లేదంటే రిమాండ్‌కి తరలిస్తారా? ఒకవేళ వంశీని రిమాండ్‌కి తరలిస్తే.. కస్టడీ పిటిషన్ వేయాలని భావిస్తున్నారు పోలీసులు. వంశీని కనీసం వంద రోజులైనా జైలులో ఉంచాలని వేర్వేరు కేసులు పెడుతున్నారని ఆరోపించారు ఆయన తరపు న్యాయవాది. సత్యవర్ధన్‌కు వంశీకి ఎలాంటి సంబంధం లేదన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి