Vande Bharat: ఏపీ ప్రజలకు న్యూ ఇయర్ గిఫ్ట్.. అందుబాటులోకి మరో వందే భారత్ రైలు..

ఏపీలోని కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రజలకు శుభవార్త. నర్సాపురం వరకు వందే భారత్ రైలు వచ్చేసింది. విజయవాడ వరకు ఉన్న వందే భారత్ సర్వీసును నర్సాపురం వరకు పొడిగించారు. దీంతో గుడివాడ, భీమవరం, నర్సాపురం ప్రాంతాల ప్రజలకు వందే భారత్ రైలు అందుబాటులో ఉండనుంది.

Vande Bharat: ఏపీ ప్రజలకు న్యూ ఇయర్ గిఫ్ట్.. అందుబాటులోకి మరో వందే భారత్ రైలు..

Updated on: Dec 15, 2025 | 4:09 PM

ఏపీ ప్రజలకు రైల్వేశాఖ మరో గుడ్‌న్యూస్ అందించింది. నరసాపురం – చెన్నై సెంట్రల్ మధ్య వందేభారత్ రైలును అందుబాటులోకి తెచ్చింది. సోమవారం నర్సాపురం రైల్వేస్టేషన్‌లో కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పచ్చజెండా ఊపి ఈ ట్రైన్‌నుప్రారంభించారు. ఈ సందర్భంగా నర్సాపురం టౌన్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే, రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, బొమ్మిడి నాయకర్ పాల్గొన్నారు. నర్సాపురం, భీమవరం , గుడివాడ ప్రాంతాల ప్రజలకు ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఎంతో ఉపయోగపడనుంది. దీంతో అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

నర్సాపురం వరకు పొడిగింపు

గతంలో ఈ వందే భారత్ రైలు విజయవాడ-చెన్నై మధ్య రాకపోకలు సాగించేది. కానీ నర్సాపురం వరకు పొడిగిస్తే బాగుంటుందని స్థానిక ప్రజల నుంచి వినతుల వచ్చాయి. కేంద్ర సహాయ మత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ దృష్టికి అధికారులు తీసుకెళ్లడంతో ఆయన రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో మాట్లాడారు. దీంతో రైల్వేశాఖ మంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో నర్సాపురం వరకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను పొడిగించాలని రైల్వేశాఖ అధికారులు నిర్ణయించారు. ఎప్పుడో ఈ నిర్ణయం తీసుకున్నా.. ఎప్పుడు ప్రారంభిస్తారనే దానిపై క్లారిటీ రాకపోవడంతో ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఇటీవల దీనికి సంబంధించి షెడ్యూల్ విడుదల చేసిన రైల్వేశాఖ నేటి నుంచి అందుబాటులోకి తెచ్చింది.

ట్రైన్ ఎక్కడెక్కడ ఆగుతుందంటే..?

ఈ ట్రైన్(నెంబర్ 20678/20677) నర్సాపూర్‌లో మధ్యాహ్నం 14.50 గంటలకు బయల్దేరి భీమవరం టౌన్‌కు 15.19, గుడివాడకు 16.04కు, విజయవాడకు 16.50కు చేరుకుంటుంది. ఇక తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట మీదుగా 23.45 గంటలకు చెన్నైకు చేరుకుంటుంది. ఇక తిరుగు ప్రయాణంలో చెన్నై నుంచి ఉదయం 5.30 గంటలకు బయల్దేరి విజయవాడకు 11.45కు చేరుకుంటుంది. ఆ తర్వాత నర్సాపూర్‌కు 14.10కు చేరుకుంటుంది. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల ప్రజలకు దీని వల్ల ప్రయోజనం పొందనున్నారు.