AP News: నీటిలో తేలుతూ కనిపించిన తెల్లటి ఆకారాలు.. ఏంటని వెళ్లి చూడగా.!

నీటిలో తేలుతూ తెల్లటి ఆకారాలు కనిపించాయి. ఏంటా అని స్థానికులందరూ ఒక్క ఉదుటన అటుగా వెళ్లి చూశారు. దెబ్బకు వారికి కనిపించినవి చూసి షాక్ తిన్నారు. వెంటనే వాటిని తీసి.. ఒడ్డుకు తీసుకొచ్చారు. ఇంతకీ ఏం జరిగింది.? ఈ ఘటన అల్లూరి జిల్లాలో చోటు చేసుకుంది. ఆ స్టోరీ ఇలా ఉంది.

AP News: నీటిలో తేలుతూ కనిపించిన తెల్లటి ఆకారాలు.. ఏంటని వెళ్లి చూడగా.!
Representative Image

Edited By: Ravi Kiran

Updated on: Jan 23, 2024 | 3:18 PM

ఆధార్ కార్డు అనేది భారత పౌరుడికి కీలకమైన గుర్తింపు కార్డుగా మారిపోయింది. ప్రభుత్వ పథకాలు అందాలన్నా.. లబ్ధిదారులుగా చేరాలన్నా.. అత్యవసర ఆరోగ్య చికిత్స కోసమైనా.. మరే ఇతర కీలక అవసరాల కోసమైనా ఆధార్ కార్డు తప్పనిసరిగా మారిపోయింది. మారుమూల ప్రాంతాల్లో గిరిజనులకు సైతం గుర్తింపు కార్డులు అందేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. అందుకోసం ప్రభుత్వ అధికారులు కూడా.. శ్రమిస్తున్నారు. పేద గిరిజనులకు ఆధార్ కార్డులు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అంతటి విలువైన ఆధార్ కార్డులు.. ఇప్పుడు గెడ్డ నీటిలో కొట్టుకుపోతుండడం.. తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అల్లూరి జిల్లాలో గిరిజనులకు చేరాల్సిన ఆధార్ కార్డులు.. గెడ్డలో ప్రత్యక్షమయ్యాయి. స్థానికులు గుర్తించి వాలంటీర్‌కు సమాచారం అందించారు. వాలంటీర్ గుర్తింపు కార్డులు అన్నింటిని తీసుకెళ్లి ఎండలో ఆరబెట్టారు. పేద గిరిజనులకు అందాల్సిన ఆధార్ కార్డులు ఇలా గెడ్డలో దర్శనమివ్వడంపై కలెక్టర్ సీరియస్ అయ్యారు.

 

230 వరకు ఆధార్ కార్డులు.. మరికొన్ని..

నూతనంగా ఏర్పడిన అల్లూరి జిల్లా అప్డేట్‌తో జనరేట్ అయిన ఆధార్ కార్డులు గెడ్డ పాలయ్యాయి. ఎవరి నిర్లక్ష్యమో.. ఏమో కానీ.. లబ్ధిదారులకు చేరాల్సిన ఆధార్ కార్డులు గెడ్డలో ప్రత్యక్షమయ్యాయి. కొత్తగా ఏర్పడిన అల్లూరి సీతారామరాజు జిల్లా పేరుతో ఇటీవలే నమోదైన ఆధార్ కార్డులు ఆదివారం హుకుంపేట రాళ్లగెడ్డ వద్ద ప్రత్యక్షమయ్యాయి. గెడ్డ వైపు వెళ్లినవారు వాటిని గుర్తించి అవాక్కయ్యారు. స్థానిక వాలంటీర్ హరికి.. సమాచారం అందించారు. స్పాట్‌కు చేరుకున్న వాలంటీర్.. గెడ్డ మధ్యలో పారబోసినట్టున్న ఆధార్ కార్డులను.. కొంతమంది సహాయంతో బయటకు తీశారు. 230 వరకు ఆధార్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. అప్పటికే నీటిలో నానిపోయి చిరిగిపోయే స్థితిలో చాలావరకు ఆధార్ కార్డులు ఉండడంతో.. వాటిని ఇంటికి తీసుకెళ్ళి ఎండబెట్టాడు. ఒక్కో ఆధార్ కార్డును తెరిచి వాటి వివరాలు చూసారు. కొన్ని హుకుంపేట పంచాయతీకి చెందిన దిగుడు పుట్టు, మరికొన్ని చింతలవీధి గ్రామానికి చెందినవిగా గుర్తించారు. మరికొన్ని ఆధార్ కార్డులు గెడ్డలో కొట్టుకొనిపోగా.. 230 వరకు మాత్రమే సేకరించగలిగామని.. వాటిలో 164 వరకు ఆధార్ కార్డులు హుకుంపేటకు చెందినవి అని అంటున్నాడు హరి. ఈ నిర్లక్ష్యానికి కారణం ఎవరు అనేది తెలియాల్సి ఉంది.

విచారణకు ఆదేశించిన కలెక్టర్.. పోస్ట్ మాస్టర్‌కు షోకాజ్ నోటీస్..

లబ్ధిదారులకు చేరాల్సిన ఆధార్ కార్డులు పోస్టల్ ద్వారా అందాల్సి ఉండగా.. గెడ్డలో ప్రత్యక్షమవడంపై గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోస్టల్ సిబ్బంది నిర్లక్ష్యంపై పెదవి విరుస్తున్నారు. తమ ఆధార్ కార్డులు ఎప్పుడు వస్తాయా.? అని ఎదురుచూస్తుంటే..! గెడ్డలో తమ గుర్తింపు కార్డులను చూసి అవాక్కయ్యారు మరికొందరు గిరిజనులు. గెడ్డలో ఆధార్ కార్డులు ప్రత్యక్షంపై.. అల్లూరి జిల్లా కలెక్టర్ సమిత్ కుమార్ సీరియస్ అయ్యారు. విచారణకు ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో హుకుంపేట పోస్ట్ మాస్టర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు తహసీల్దార్ రాజ్యలక్ష్మి. ఆధార్ కార్డులు గెడ్డలో పారబోసిన ఘటనపై పూర్తిస్థాయి ఎంక్వయిరీ చేసి.. తగిన చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరుతున్నారు.