Aadhaar: ఆధార్ సెంటర్లలో అడ్డగోలుగా దోచుకుంటున్నారా.. ఇలా ఫిర్యాదు చేయండి

ప్రభుత్వ పథకాలు, బ్యాంకింగ్‌ సేవలు, సబ్సిడీలు.. ఇలా ఏది కావాలన్నా ఆధార్‌ తప్పనిసరి. అయితే ఆధార్‌ కేంద్రాల వద్ద రద్దీని అవకాశంగా మార్చుకుని కొంతమంది అధిక వసూళ్లు చేస్తున్నారన్న ఫిర్యాదులు వస్తున్నాయి. కేంద్రం ఆధార్‌ రుసుముల్లో ఇటీవల మార్పులు చేసింది. అక్టోబర్‌ 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. ఫీజు వివరాలు ప్రతి కేంద్రంలో గోడపై ప్రదర్శించాలని యూఐడీఏఐ ఆదేశించింది.

Aadhaar: ఆధార్ సెంటర్లలో అడ్డగోలుగా దోచుకుంటున్నారా.. ఇలా ఫిర్యాదు చేయండి
Aadhaar Enrollment

Edited By: Ram Naramaneni

Updated on: Oct 29, 2025 | 8:11 PM

మన వ్యక్తిత్వానికి గుర్తు ఆధార్‌. నేడు దేశంలో ఎవరికైనా ప్రభుత్వ పథకాలు కావాలన్నా, బ్యాంకు పనులు చేయాలన్నా, సబ్సిడీలు పొందాలన్నా… ఆధార్‌ తప్పనిసరిగా అవసరమయ్యే పరిస్థితి. అందుకే ఆధార్‌ కేంద్రాల వద్ద ఎప్పుడూ జనసందోహమే కనిపిస్తుంది. కొత్తగా నమోదు చేసుకునేవాళ్లు, పేరు, అడ్రస్ మార్చించుకునేవాళ్లు, బయోమెట్రిక్‌ అప్‌డేట్‌ చేయించుకునేవాళ్లు ఎప్పుడూ లైన్లలోనే ఉంటున్నారు.

అయితే ఈ రద్దీని, అవసరాన్ని లాభంగా మార్చుకుంటూ కొంతమంది సెంటర్ల వద్ద అన్యాయంగా వసూళ్లకు తెగబడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ నియమాల ప్రకారం తీసుకోవాల్సిన ఫీజులకంటే ఎక్కువ వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. అధికారుల తనిఖీలు మాత్రం పేరు కోసం మాత్రమే జరుగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి.

ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆధార్‌ నమోదు, అప్‌డేట్‌లకు సంబంధించిన రుసుములలో మార్పులు చేసింది. అక్టోబర్‌ 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. ఇకపై ప్రతి కేంద్రం వద్ద ఫీజుల వివరాలు గోడపై స్పష్టంగా ప్రదర్శించాలి అని యూఐడీఏఐ (UIDAI) ఆదేశించింది.

కొత్త ఛార్జీలు ఇలా ఉన్నాయి:

కొత్త ఆధార్‌ నమోదు: 0

5–7, 15–17 ఏళ్ల వారికి బయోమెట్రిక్‌ అప్‌డేట్‌: 0

పేరు, అడ్రస్, పుట్టినతేదీ, ఫోన్‌ నంబర్‌, జెండర్, ఈ–మెయిల్‌ వివరాల అప్‌డేట్‌: రూ. 75

డాక్యుమెంట్‌ అప్‌లోడ్‌: రూ. 75

17 ఏళ్లు దాటిన వారికి బయోమెట్రిక్‌ అప్‌డేట్‌: రూ. 125

ఇంటికి వచ్చి ఆధార్‌ నమోదు లేదా అప్‌డేట్‌: రూ. 700

అదే ఇంట్లో మరోవ్యక్తికి నమోదు: రూ100–రూ 350

ఆధార్‌ డౌన్‌లోడ్‌ చేసి ప్రింట్‌ ఇవ్వడం: రూ 40

ప్రభుత్వం పెట్టిన ఫీజుల కంటే అధికంగా వసూలు చేస్తే వెంటనే ఫిర్యాదు చేయవచ్చు. 1947 కాల్ చేసి… help@uidai.gov.in కు మెయిల్ చేసి.. https://resident.uidai.gov.in/file-complaint వెబ్సైట్ లోకి వెళ్ళి ఫిర్యాదు చెయ్యవచ్చు.