క్రికెట్ బెట్టింగ్ ఇద్దరి ప్రాణాలు తీసింది. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురానికి చెందిన అన్నదమ్ములు ఉత్తరప్రదేశ్ వారణాసిలో ఉరేసుకుని ప్రాణాలు విడిచారు. చనిపోవడానికి ముందు సెల్ఫీవీడియో రిలీజ్ చేశారు. దండు గోపాలకృష్ణంరాజు, కమ్ముల గోపి, కమ్ముల సాయితేజ, గుర్రం ప్రసాద్ అనే క్రికెట్ బుకీల బెదిరింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నామని వీడియోలో చెప్పారు. మూడుకోట్ల రూపాయలు బెట్టింగ్‌లో పొగొట్టుకున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు.
నలుగురు క్రికెట్ బుకీల వేధింపులు భరించలేక నారాయణపురానికి చెందిన లక్ష్మీనారాయణ, లోక్‌నాథ్‌లు ఈ యేడాది ఏప్రిల్‌లో ఇల్లు వదిలి పారిపోయారు. యూపీలోని వారణాసిలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని తలదాచుకున్నారు. అయినా వారి వేధింపులు ఆపకపోవడంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తామే కాదు ఎంతో మందిని బుకీలు వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరెవ్వరికీ ఇలాంటి అన్యాయం జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. అన్నదమ్ములు ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇల్లు వదిలి పారిపోయారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో చేబ్రోలు పోలీసులు మిస్సింగ్ నమోదు చేశారు. నాటి నుంచి వారణాసిలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. బుకీల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నారు.
ఈ బెట్టింగ్ రాయుళ్ల వలలో చిక్కుకుని జేబులు గుల్ల చేసుకుంటున్నారు సామాన్యులు. వీరిలో అత్యధికంగా చిరు వ్యాపారులు, విద్యార్థులు ఉండటం ఆందోళన కలిగించే విషయం. తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చనే అత్యాశతో వారు చితికిపోతున్నారు. బెట్టింగ్ ఊబిలో కూరుకుపోయి బయటకు రాలేక ఉక్కిరిబిక్కిరి అవుతన్నారని పోలీసులు చెబుతున్నారు.అందుకే బెట్టింగ్ కు దూరంగా ఉండాలి. బెట్టింగ్ మోజులో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని హెచ్చరిస్తున్నారు పోలీసులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..