ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలోనూ రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. టీడీపీ-జనసేన- బీజేపీ మధ్య మళ్లీ పొత్తులకు లైన్ క్లియర్ అవుతోంది. బీజేపీ కూడా తమతో కలిసివచ్చేలా ప్రయత్నిస్తామన్న పవన్ కల్యాణ్ దాదాపు ఒప్పించారు. ఇప్పటికే మూడు పార్టీల మధ్య పొత్తులపై సూత్రప్రాయ అంగీకరం కుదిరింది. త్వరలోనే ఢిల్లీ వెళ్లి తుదిదశ చర్చలు జరపనున్నారు జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్. టీడీపీ-జనసేన ఎక్కడ పోటీచేయాలో తమకు స్పష్టత ఉందని.. సంక్రాంతి తర్వాత ప్రకటన చేస్తామని ఇప్పటికే టీడీపీ నేతలు చెబుతున్నారు. బీజేపీతో సీట్లు సర్దుబాటు తర్వాతే అభ్యర్ధులను ప్రకటించే అవకాశం ఉంది.
అటు బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా పొత్తులపై ఇప్పటికే తమ అభిప్రాయాన్ని ఢిల్లీ పెద్దలకు తెలియజేసింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన కీలక సమావేశంలోనూ రాష్ట్రానికి చెందిన మెజార్టీ నాయకులు పొత్తులకు అనుకూలంగా తమ అభిమతం అధిష్టానం ముందుంచారు. ఈ విషయాలను నివేదిక రూపంలో సిద్ధం చేసి ప్రధానమంత్రి నరేంద్రమోదీ టేబుల్‌పై పెట్టారు పార్టీ పెద్దలు. జనసేనతో ప్రస్తుతం పొత్తులో ఉన్నామని ఇతర నిర్ణయాలు అధిష్టానం తీసుకుంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి క్లారిటీ ఇచ్చారు.
పొత్తులకు మూడు పార్టీలు సిద్ధమే.. కానీ గతంలో ఎందుకు విడిపోయారు .. ఇప్పుడు మళ్లీ ఎందుకు కలవాల్సి వస్తుందన్న ప్రశ్నలకు సమాధానం చెబుతాయా? రిపీట్ అవుతున్న పొత్తును ప్రజలు స్వాగతిస్తారా? అంతకుమించి పార్టీల్లో సీట్ల సర్దుబాట్లలో ఉండే సవాళ్లను అధిగమిస్తారా? డీకే శివకుమార్‌తో చంద్రబాబు భేటికి ప్రాధాన్యత ఉందా?. ఈ రోజు బిగ్ న్యూస్ బిగ్ డిబేట్‌లో చూద్దాం…
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..