TTD: ఒకే ఫోన్ నంబర్‌తో బల్క్ బుకింగ్స్.. శ్రీవాణి టికెట్ల పేరిట భారీ దందా! విజిలెన్స్ ధర్యాప్తులో..
తిరుమల శ్రీవారిని దగ్గరుండి దర్శించుకోవాలని ఆశపడే భక్తులను ఆసరాగా చేసుకుని కొన్ని ట్రావెల్ ఏజెన్సీలు అక్రమాలకు పాల్పడుతున్నాయి. ఎలాంటి సిఫారసు లేఖలు లేకుండా నేరుగా బ్రేక్ దర్శనం పొందేందుకు టీటీడీ ప్రవేశపెట్టిన శ్రీవాణి టికెట్లను అడ్డుపెట్టుకుని భక్తులను బురిడీ కొట్టిస్తున్నాయి. దీనిపై దృష్టి పెట్టిన పోలీసులు ట్రావెల్ ఏజెన్సీలపై నిఘా పెట్టారు.

భక్తుల సౌకర్యార్థం టీటీడీ అనేక మార్పులు చేస్తుంది. అందులో భాగంగానే తాజాగా ఎలాంటి సిఫారసులు లేఖలతో పని లేకుండా శ్రీవాణి టికెట్‌తోనే శ్రీవారి బ్రేక్ దర్శనం కల్పించే సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఈ మేరకు టీటీడీ ప్రతిరోజూ మొత్తం 1,500 శ్రీవాణి టికెట్లను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో భక్తులకు అందుబాటులో ఉంచుతోంది. అయితే విదేశీ భక్తుల సౌకర్యార్థం 500 టికెట్లను మూడు నెలలు ముందుగానే ఆన్లైన్‌లో జారీ చేస్తున్న టీటీడీ.. ఏ రోజుకు ఆ రోజు మిగతా 1000 టికెట్లను భక్తులకు అందుబాటులో ఉంచుతోంది. ప్రతిరోజు ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో 800 శ్రీవాణి టికెట్లను టీటీడీ వెబ్ సైట్‌లో విడుదల చేస్తోంది.
మిగిలిన 200 టికెట్లను తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో బోర్డింగ్ పాస్ ఆధారంగా విమాన ప్రయాణికులకు జారీ చేస్తారు. ఉదయం 7 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇక్కడ టికెట్లు పొందవచ్చు. ఇలా అడ్వాన్స్, ఆన్ లైన్, ఆఫ్ లైన్‌లో శ్రీవాణి టికెట్లు పొందిన భక్తులకు ప్రతిరోజూ సాయంత్రం 4 నుండి 6 గంటల మధ్యలో శ్రీవారి దర్శనం కల్పిస్తారు. ఎంతో పారదర్శకంగా శ్రీవాణి టికెట్ల జారీ చేయాలని భావిస్తున్న టీటీడీ మార్గదర్శకాలను కూడా మార్పు చేసింది.
అయితే శ్రీవాణి టికెట్ల జారీలో పారదర్శకత ఉండాలని టీటీడీ నిబంధనలు కఠినతరం చేసినా, కొందరు కేటుగాళ్లు మాత్రం టెక్నాలజీని వాడుకుని మోసాలకు పాల్పడుతున్నారు. వెబ్‌సైట్‌లో టికెట్లు విడుదలైన కొద్ది క్షణాల్లోనే మాయమవుతుండటంతో విజిలెన్స్ విభాగం నిఘా పెట్టింది. ఈ క్రమంలో చెన్నైకి చెందిన పద్మావతి ట్రావెల్ సంస్థ ఒకే ఫోన్ నెంబర్ తో అత్యధిక శ్రీవాణి టికెట్స్ పొందుతున్నట్లు గుర్తించిన టీటీడీ విజిలెన్స్ వింగ్ గత ఈ నెల 6 బయోమెట్రిక్ వద్ద తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో అన్‌బూ అనే వ్యక్తి రూ. 54 వేలు చెల్లించి భక్తులు శ్రీవాణి టికెట్టు పొందినట్లు విజిలెన్స్ గుర్తించింది.
అయితే దీనిపై విజిలెన్స్ భక్తుల నుంచి వివరాలు సేకరించగా.. వాస్తవానికి శ్రీవాణి టికెట్ ధర రూ. 10,500 ఉండగా, ట్రావెల్ ఏజెన్సీ ప్రతి టికెట్‌ను రూ. 13,500 చొప్పున విక్రయించినట్లు భక్తులు తెలిపారు. దీంతో మరికొందరు భక్తులను విచారించి వివరాలు సేకరించిన విజిలెన్స్ టీం నగదు బదిలీలపై ఆరా తీసింది. ఈ మేరకు తిరుమల వన్ టౌన్ పోలీసులకు విజిలెన్స్ ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సామాన్య భక్తులకు అందాల్సిన టికెట్లను ట్రావెల్ ఏజెన్సీలు ఎలా చేజిక్కించుకుంటున్నాయనే అంశంపై పోలీసులు గట్టి నిఘా పెట్టారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
