తిరుమల, ఆగస్టు 18: టీటీడీ సిబ్బంది.. ఫారెస్ట్ అధికారుల ఎఫర్ట్స్ ఫలించాయి. తిరుమల కొండపై ఏర్పాటు చేసిన బోన్లకు చిరుత చిక్కింది. అయితే ఒక చిరుత కాదు… నడక మార్గంలో మరో 3 చిరుతలు ఉన్నాయని భయపెడుతుండగా.. ఇప్పుడు కొండపై మరో భయం వెంటాడుతోంది. శ్రీవారి భక్తులకు ఎలుగుబంటి భయం వణికిస్తోంది. తిరుమల కొండల్లో వన్యమృగాల భయం శ్రీవారి భక్తులను భయపెడుతోంది.. అలిపిరి నుంచి కాలినడకన వెళ్లే భక్తులకు అనేక సందర్భాల్లో ఎలుగుబంటి తారసపడింది. నిత్యం తిరుపతి నుంచి అలిపిరి, శ్రీవారిమెట్టు కాలినడక మార్గం ద్వారా భక్తులు నడిచి తిరుమలకు చేరుకుంటుంటారు. సాధారణ రోజుల్లో కాలినడకన తిరుమల వెళ్లే భక్తుల సంఖ్య ఇరవై నుంచి ఐరవై ఐదు వేల వరకు ఉంటుంది..
వారాంతంలో అయితే ఈ సంఖ్య ముప్పై నుంచి ముప్పై ఐదు వేల వరకు ఉంటుంది. ప్రత్యేక రోజుల్లో అయితే కాలినడకన కొండకు చేరుకునే భక్తుల సంఖ్య నలభై వేలు దాటుతుంది. ఇటీవల కాలంలో నడిచి వెళ్లే మార్గంలో వన్యమృగాల సంచారం మరింత ఎక్కువైంది. ఓ వైపు చిరుతలు భయపెడుతుంటే.. ఇప్పుడు మరో భయం వెంటాడుతోంది. ఈ సమాచారం తెలిసినప్పటి నుంచి భక్తుల్లో భయం పెరిగింది.. ఇటీవల ఎలుగుబంటి సంచారం భక్తుల్లో భయాన్ని పెంచింది.
శ్రీవారి మెట్టు, ఏడో మైలు ప్రాంతంలో తరచూ ఎలుగుబంటి సంచరించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డాయ్యాయి. భక్తులు కూడా చాలా సార్లు ఎలుగుబంటి కనిపించిన విషయాన్ని టీటీడీ సిబ్బంది దృష్టికి తీసుకువచ్చారు. కొంతమంది భక్తులు మొబైల్ ఫోన్లో కూడా ఎలుగుబంటిని ఫోటోలు తీశారు.. భక్తులు అందించిన సమాచారంతో టీటీడీ ఆపరేషన్ బంటి కార్యక్రమం చేపట్టింది.
ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది టిటిడి. ఇందుకోసం 25 మంది సిబ్బందిని ఇప్పటికే నడకదారిలో ఏర్పాటు చేసింది. ఎలుగుబంటిని బందించేందుకు ప్రత్యేక బోన్లు, వలలతో ఆపరేషన్ మొదలు పెట్టింది. రెండు సార్లు వలలకు చిక్కినట్టే చిక్కి తప్పించుకుంది బంటి.
పట్టుకోవడం మీపనైతే.. తప్పించుకోవడం నాకు తెలుసంటూ చిక్కకుండా ముప్పతిప్పలు పెడుతోంది ఎలుగుబంటి.. ఎక్కడైతే బంటిని బందించేందుకు ఏర్పాట్లు చేశారో అక్కడే ధైర్యంగా తిరుగుతోంది. భక్తులను ఎప్పటికప్పుడు టీటీడీ అధికారులను అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. దీంతో ఎలాగైనా ఎలుగుబంటిని బందించాలని టీటీడీ ఇందుకోసం అదనంగా మరో బృందాన్ని కూడా రంగంలోకి దించుతోంది. శ్రీవారి భక్తుల్లో భయాన్ని నింపిన ఎలుగుబంటి ఎప్పుడు చిక్కుతుందో చూడాలి మరి.
ఇదిలావుంటే, భక్తులకు టీటీడీ కొన్ని సూచనలు చేసింది. నడకదారిలో సాధుజంతువులకు కూడా ఎలాంటి ఆహారం ఇవ్వొద్దని… ఇస్తే చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది. వ్యర్థ పదార్థాలను షాపుల బయట వదిలేసేవారిపై చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. భద్రత కోసం డ్రోన్లు కూడా వాడాలని నిర్ణయించింది. 30 మీటర్లు దూరం కనపడేలా మెట్ల మార్గంలో ఫోకస్ లైట్లతో పాటు 500 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లుగా గతంలో టీటీడీ తెలిపింది. నడకదారిలో ప్రమాదాలపై భక్తులకు అప్రమత్తం చేసేలా సైన్‌బోర్డ్స్ ఏర్పాటు చేస్తామని వెల్లడించింది. అలిపిరి, గాలిగోపురం, 7వ మైలురాయి దగ్గర హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేసి భద్రతపై భక్తులకు కల్పిస్తామన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..