
ఆపదమొక్కుల స్వామి మొక్కులు తీర్చుకునేందుకు తిరుమలకొచ్చే భక్తులకు శ్రీవారి అన్నప్రసాదం మహా అద్భుతం. తిరుమలేశుడి దర్శించుకునే సామాన్య భక్తుల నుంచి సంపన్నుడి దాకా తిరుమలలోని శ్రీ తరిగొండ వెంగమాంబ నిత్య అన్నదానం సత్రంలో అన్నప్రసాదం తీసుకోవడం ఒక భాగ్యం.
ఈ నేపథ్యంలోనే ప్రతి నెల దాదాపు రూ 105 కోట్లు ఖర్చు చేస్తూ సామాన్యుల నుంచి సంపన్న భక్తుల వరకు శ్రీవారి దివ్య ప్రసాదంగా టీటీడీ అన్నదానం కొనసాగిస్తోంది. ఇలా నిత్యం లక్షలాది మంది భక్తులకు నాలుగు దశాబ్దాలుగా రుచిగా శుచిగా అన్నప్రసాదం అందిస్తున్న నిత్య అన్నదాన సత్రం ఈ రోజు నుంచి అదనంగా మరో వంటకాన్ని వడ్డించి భక్తులకు రుచి చూపించబోతోంది.
రాష్ట్రంలో కొలువైన కూటమి ప్రభుత్వం తిరుమలపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో అన్నదానంపై ఫోకస్ పెరిగింది. క్వాలిటీ, సర్వీస్, మోడ్రన్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో అన్నదాన సత్రాన్ని అందుబాటులో తెచ్చేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే సౌత్ ఇండియన్ చెఫ్ అసోసియేషన్ సహకారం పొందుతూ సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. రూ. 2 వేల కోట్ల మేర ఉన్న డిపాజిట్ సొమ్ముతో నిత్య అన్నదానం నిర్వహిస్తున్న టీటీడీ నిత్య అన్నదానం ట్రస్ట్‌కు విరాళాలతోనే నిర్వహిస్తోంది. భక్తులు డిపాజిట్ చేసిన సొమ్ము భక్తులకే ఖర్చు చేస్తున్న టీటీడీ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు భక్తులకు అన్నప్రసాదాన్ని అందిస్తోంది.
నాలుగు హాల్స్ ఉన్న అన్నదాన సత్రంలో ఒక్కో హాల్లో 1000 మంది భక్తులు కూర్చుని భోజనం చేసేలా టీటీడీ వసతి కల్పించింది. ఒక్కో యూనిట్‌లో 80 వేల మంది భక్తులు శ్రీవారి అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తుండగా శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు, కంపార్ట్మెంట్‌లో ఉండే భక్తులకు, నారాయణగిరి షెడ్స్‌లో ఉండే భక్తులకు టీటీడీ అన్నప్రసాదాన్ని తరిగొండ వెంగమాంబ నిత్య అన్నదాన సత్రం నుంచే అందిస్తోంది. ఇలా క్యూలైన్‌లలో వేచి ఉండే భక్తులకు, శ్రీవారి దర్శనం కోసం వేచి ఉండే భక్తులకు, శ్రీవారి సేవకులకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో ఉండే వారికి ప్రతిరోజు దాదాపు 2 లక్షల మందికి టీటీడీ అన్నప్రసాదం సమకూర్చుతోంది. రూ. 2 వేల కోట్ల మేర ఉన్న అన్నదానం ట్రస్ట్‌కు డిపాజిట్ సొమ్ము వడ్డీతో టీటీడీ నిత్య అన్నదానం కార్యక్రమాన్ని కొనసాగిస్తుంది. ఇలా గత 40 ఏళ్లుగా టీటీడీ నిత్య అన్నదానం ఒక మహా యజ్ఞంలా నిర్వహిస్తోంది.
టీటీడీ అన్నదానం మెనూలో టీటీడీ మసాలా వడను నేటి నుంచి అందుబాటులోకి తీసుకొచ్చింది. గత ఏడాది నవంబర్‌లో జరిగిన పాలకమండలిలోనే ఈ మేరకు తీర్మానం చేసినా అమలుకు 3 నెలల సమయం పట్టింది. గత కొన్నేళ్లుగా అన్నంతో పాటు కర్రీ, చట్నీ, సాంబార్, రసం, మజ్జిగతో పాటు చక్కెర పొంగలి భక్తులకు వడ్డిస్తున్న టీటీడీ. అన్న ప్రసాదంలో మరో రకం చేర్చాలన్న నిర్ణయాన్ని అమలు చేసింది. గత జనవరిలో ప్రయోగాత్మకంగా మసాలా వడ ప్రయత్నం చేసిన టీటీడీ.. ఉల్లి, వెల్లుల్లి లేకుండా అప్పట్లో 5 వేల వడలను తయారు చేసి భక్తులకు వడ్డించింది. కొన్నిరోజుల పాటు భక్తులకు వడ తయారు చేసి వడ్డించిన టీటీడీ నేటి నుంచి మసాలా వడను ప్రారంభించింది. భక్తుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్న తర్వాత అమలు చేస్తున్న టీటీడీ
మెనూలో మసాలా వడ కంటిన్యూ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే టీటీడీ అన్నదానంలో అదనంగా మసాలావడను ప్రారంభించి మరో వంటకాన్ని భక్తులకు అందుబాటులోకి తెచ్చింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి