ప్రమాదం జరిగింది.. ప్రాణప్రాయం జరగలేదు. బస్సు అదుపుతప్పింది.. జనానికి భూమిపై నూకలున్నాయోమే.. ఇంకా చెప్పాలంటే.. శివుడాజ్ఞలేనిది చీమ అయినా కుట్టదంటారు.. అందుకనేమో ఘోర ప్రమాదం నుంచి అంతా క్షేమంగా బయటపడ్డారు. శ్రీశైలం దగ్గర TSRTC బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. శ్రీశైలం నుంచి మహబూబ్‌నగర్ వెళ్తున్న బస్సు శ్రీశైలం డ్యాం దగ్గర ఘాట్‌లో గోడను ఢీ కొట్టింది. టర్నింగ్ దగ్గర అదుపుతప్పింది. గోడకు ఉన్న ఇనుప మేకులకు తట్టుకొని బస్సు ఆగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని హుటాహుటిన కిందకు దిగారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. డ్రైవర్ వేగాన్ని నియంత్రించలేకపోవడంతో బస్సు ఘాట్ రోడ్‌లో రక్షణ గోడను ఢీ కొట్టినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో రక్షణ గోడ ధ్వంసమైనా.. ఇనుప బారికేడ్ ఉండటంతో లోయల పడకుండా అక్కడే ఆగిపోయింది బస్సు. తాము ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురవడంతో ప్రయాణికులందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే బస్సు నుంచి దిగి బయటకు వెళ్లారు. ప్రమాద సమయంలో అందులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డామని వారంతా ఊపిరిపీల్చుకున్నారు.
ఇనుప బ్యారికేడ్ లేకుంటే ఉంటే.. ప్రమాద తీవ్రత ఊహించుకోలేకపోయేవారమని అంటున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు ఇరువైపులా ఉన్న ఘాట్ రోడ్ మలుపుల వద్ద రక్షణ గోడలు బలహీనంగా ఉన్నాయని ప్రయాణికులు చెబుతున్నారు. అప్పటి వరకు ప్రయాణం హాయిగా సాగుతోంది. కొంత మంది నిద్రలోకి జారుకున్నారు. ఇంతలోనే ప్రమాదం, అది కూడా ఘాట్ రోడ్డులో. ఆ క్షణానికి ప్రయాణికులందరికి ఊపిరి ఆగినంత పని అయ్యింది. అయితే అదృష్టవశాత్తు బస్సు గోడను ఢీకొట్టి అగిపోయింది. బస్సు పూర్తి స్థాయిలో అదుపుతప్పినా.. లేదంటే గోడ మొత్తం కూలినా బస్సు లోయలో పడేది. ప్రమాదంపై అధికారులు విచారణ ప్రారంభించారు.
మరిన్ని ఆంద్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..