Nallamala Forest: దట్టమైన అడవిలోకి ఇవి ఎలా వచ్చాయ్.. ఉలిక్కిపడ్డ ఫారెస్ట్ అధికారులు

నల్లమల అడవుల్లో నిశ్శబ్దం వెనుక కలవరం దాగుందా? డీప్ ఫారెస్ట్‌లో అంతర్జాతీయ స్థాయి ఉచ్చుల లభ్యం అవ్వడంతో.. పెద్దపులుల భద్రతపై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఏడుగురు అరెస్టులు యాదృచ్ఛికమా? లేక పెద్ద వేట ముఠా వెనుక ఉందా? అన్న కోణంలో ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ సిబ్బంది విచారణ ప్రారంభించారు.

Nallamala Forest: దట్టమైన అడవిలోకి ఇవి ఎలా వచ్చాయ్.. ఉలిక్కిపడ్డ ఫారెస్ట్ అధికారులు
Tiger Traps In Nallamala

Edited By:

Updated on: Dec 16, 2025 | 3:10 PM

శ్రీశైలం–నాగార్జునసాగర్ టైగర్ రిజర్వ్.. దేశంలోనే అతిపెద్ద పులుల అభయారణ్యాల్లో ఒకటి. అయితే ఇప్పుడు ఇదే అడవి… సంచలన ప్రశ్నలకు కేంద్రంగా మారుతోంది. పెద్దపులులు, చిరుతపులుల భద్రతపై అనుమానాలు పెరుగుతున్నాయి. అసలు నల్లమల అడవుల్లో ఏం జరుగుతోంది? వేటగాళ్లు అడవిలోకి చొరబడుతున్నారా? లేదా ఇప్పటికే వ్యవస్థను మోసం చేసే స్థాయికి చేరుకున్నారా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని నాగాలూటి రేంజ్‌లో పెద్దపులి కోసం వేసిన ఉచ్చులు లభ్యం కావడంతో అటవీశాఖ ఒక్కసారిగా అప్రమత్తమైంది. అత్యంత దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో, అంతర్జాతీయ స్థాయి నాణ్యత కల ఉచ్చులు ఎలా చేరాయి? పగడ్బందీ గస్తీ, చీమ చిటుకుమన్న ఉన్నతాధికారులకు తెలిసే సాంకేతిక పరిజ్ఞానం మధ్య వేటగాళ్లు ఎలా చొరబడ్డారు? ఇది సాధారణ వేటా… లేక పెద్ద ముఠా వెనుక ఉన్నదా?.. ఈ అంశాలపై లెక్క తేల్చేందుకు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. నల్లమల అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ (NSTR) అంతటా గస్తీని మరింత కట్టుదిట్టం చేశారు.

పది రోజుల క్రితమే.. పెద్దపులిని చంపి గోళ్లు తీసుకెళ్లి.. హై సొసైటీ వ్యక్తులకు విక్రయించిన కేసులో ఏడుగురు నిందితులను అటవీశాఖ అరెస్టు చేసింది. అమ్మినవారితో పాటు కొనుగోలు చేసిన వారినీ అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు లభ్యమైన ఉచ్చులకు.. ఈ కేసుతో సంబంధం ఉందా? లేదా ఇంకా పెద్ద నెట్‌వర్క్ పనిచేస్తోందా? అన్నది చర్చనీయాంశంగా మారింది. గతంలో నల్లమలలో పెద్దపులులు, చిరుతపులుల మృతుల వెనుక వేటగాళ్ల హస్తం ఉందా అనే అనుమానాలు అప్పుడే వ్యక్తమయ్యాయి. ఇప్పుడు అదే అనుమానాలకు ఉచ్చుల లభ్యం మరింత బలం చేకూరుస్తోంది.

నల్లమల అభయారణ్యంలో పెద్దపులులు, చిరుతపులుల మనుగడకు నిజంగానే ప్రమాదం పొంచి ఉందా? అడవిలో అడుగడుగునా నిఘా ఉన్నా వేటగాళ్లు ఆధునిక సాంకేతికతతో అటవీశాఖ కళ్లకు గంతలు కడుతున్నారా? ఈ కోణంలోనే అటవీశాఖ అధికారులు..వేటగాళ్లపై మళ్లీ నిఘా పెంచారు. వారి కదలికలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.