Andhra Pradesh: ఉపాధి హామీ పనులకు ట్రాక్టర్‌లో బయలుదేరిన కూలీలు.. కాసేపటికే.. అయ్యో భగవంతుడా..

రెక్కాడితే గాని డొక్కాడని ఆ కూలీలు, ఉపాధి పనుల కోసం ఆశగా బయలుదేరారు. కానీ విధి మరోలా తలచింది. అతివేగం రూపంలో వచ్చిన మృత్యువు ఒకరిని బలితీసుకోగా, మరెంతో మందిని ఆసుపత్రి పాలు చేసింది. తిరుపతి జిల్లా పెనగలూరు మండలంలో జరిగిన ఈ భయానక ట్రాక్టర్ ప్రమాదంలో ఏం జరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాం..

Andhra Pradesh: ఉపాధి హామీ పనులకు ట్రాక్టర్‌లో బయలుదేరిన కూలీలు.. కాసేపటికే.. అయ్యో భగవంతుడా..
Tractor Accident In Tirupati

Edited By:

Updated on: Apr 16, 2026 | 2:15 PM

నిత్యం కష్టపడితేనే కడుపు నిండే ఆ పేద కూలీల జీవితాల్లో ట్రాక్టర్ ప్రమాదం తీరని విషాదాన్ని నింపింది. ఉపాధి పనుల కోసం వెళ్తుండగా ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడటంతో ఒకరు అక్కడికక్కడే మృత్యువాత పడగా, మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. తిరుపతి జిల్లా పెనగలూరు మండలం వెలగచర్ల వద్ద గురువారం ఉదయం ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. వెలగచర్ల గ్రామానికి చెందిన సుమారు 25 మంది కూలీలు ఉదయం 10 గంటల సమయంలో ఉపాధి హామీ పథకం పనులకు వెళ్లేందుకు ట్రాక్టర్‌లో బయలుదేరారు. గ్రామం దాటి కొద్ది దూరం వెళ్లిన తర్వాత డ్రైవర్ అతివేగంగా నడపడంతో ట్రాక్టర్ ఒక్కసారిగా నియంత్రణ తప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది.

ట్రాక్టర్ కింద కూలీలు పడిపోవడంతో ఆ ప్రాంతమంతా ఆర్తనాదాలతో మిన్నంటింది. ఈ ప్రమాదంలో ఒక కూలీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మిగిలిన వారంతా తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన 25 మందిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉండటంతో, మెరుగైన వైద్యం కోసం వారిని వెంటనే తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిర్లక్ష్యం మరియు అతి వేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది.

పోలీసులు విచారణ

సమాచారం అందుకున్న పెనగలూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పనులకు వెళ్తూ ప్రమాదం బారిన పడటంతో బాధితుల గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Follow Us