
గిన్ని కోళ్లు సాధారణంగా అడవి పక్షులుగా పేరుపొందినప్పటికీ, వాటిని ఇళ్లల్లో లేదా పొలాల్లో పెంచడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ఈ లాభాలను అర్థం చేసుకోవడం ద్వారా, వాటి పెంపకం ఎంత ప్రయోజనకరమో తెలుసుకోవచ్చు. ఈ కోళ్లు సాధారణంగా పొలాల్లో తిరుగుతూ పురుగులను తింటాయి. ఇవి మీ చుట్టుపక్కల ఉండే పురుగులను తినడం వల్ల, పంటలకు, మొక్కలకు హాని కలిగించే కీటకాల సమస్య గణనీయంగా తగ్గుతుంది. దీంతో జీవ వైవిధ్యం బాగుంటుంది. అంతేకాదు మొక్కలు బాగా పెరగడానికి సహాయపడుతుంది. గిన్ని కోళ్లు పాములను పూర్తిగా రానివ్వవని చాలామంది భావిస్తారు. అయితే, ఇది పూర్తిగా నిజం కాదు. గిన్ని కోళ్లు ఉన్న చోట కూడా పాములు వస్తాయి. కానీ, అవి కొత్త మనుషులను లేదా ఫామ్‌కు సంబంధం లేని జంతువులను చూసినప్పుడు ఆగకుండా బిగ్గరగా అరుస్తాయి. ఈ శబ్దం పాములను భయపెట్టి, వాటిని దూరంగా ఉంచుతుంది. చిన్న పాము పిల్లలను అయితే గిన్ని కోళ్లు చంపేయగలవు కూడా. ఇదే విధంగా, మీ ఫామ్‌లోకి వచ్చే నక్కలను కూడా గిన్ని కోళ్లు తమ అరుపులతో, విసిగించి తరిమేస్తాయి.
గిన్ని కోళ్లను పెంచడం చాలా సులభమైన పని. వాటికి ఎక్కువగా జబ్బులు రావు, ఇది పెంపకందారులకు ఒక పెద్ద ప్రయోజనం. దానా విషయంలో కూడా పెద్దగా ఖర్చు ఉండదు. ఎందుకంటే గిన్ని కోళ్లు తమ ఆహారంలో ఎక్కువ భాగాన్ని బయట తిరుగుతూ.. పురుగులు, కీటకాలు, గింజలు వంటి వాటిని తినడం ద్వారా స్వయంగా సమకూర్చుకుంటాయి. ఇది పెంపకం ఖర్చులను తగ్గిస్తుంది. ఇవి సంవత్సరానికి 100కు పైగా గుడ్లు పెడతాయి. ఈ గుడ్లలో 95 శాతం పిల్లలు అయ్యే అవకాశం ఉంది. అయితే, గిన్ని కోళ్లు గుడ్లను సరిగ్గా పొదగవు కాబట్టి, వాటిని మెషిన్‌లో కానీ లేదా కోడి కింద కానీ పొదిగించుకోవాలి. గిన్ని కోళ్ల మాంసం చాలా రుచికరంగా ఉంటుంది. వాటి మాంసంలో అనేక పోషక విలువలు ఉంటాయి. ఒకసారి మీ ఫామ్‌లో అలవాటు పడితే, గిన్ని కోళ్లు తొందరగా వేరే వారి దగ్గరికి వెళ్ళవు. ఇవి తమ నివాసానికి, పెంపకందారులకు చాలా నమ్మకంగా ఉంటాయి. నిజానికి, ఇవి ఎలాంటి జీతం తీసుకోకుండా మీ ఫామ్‌కు సెక్యూరిటీ గార్డ్స్‌లా పనిచేస్తాయి. అవి తమ చుట్టూ ఉన్న పరిసరాలను చాలా రక్షణాత్మకంగా చూసుకుంటాయి. తక్కువ ఖర్చుతో, తక్కువ శ్రమతో, అనేక ప్రయోజనాలను అందించే గిన్ని కోళ్లను మీ ఇంటిలో లేదా పొలంలో పెంచుకోవడం ద్వారా మీరు కూడా ఈ లాభాలను పొందవచ్చు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..