TTD: తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. అదనపు కోటా టికెట్లు విడుదల చేసిన టీటీడీ..
ఫిబ్రవరి 23న ప్రత్యేక ప్రవేశ దర్శనం, సర్వదర్శనం టోకెన్ల(darshan tokens) అదనపు కోటా టికెట్లను టీటీడీ(TTD) విడుదల చేసింది...
ఫిబ్రవరి 23న ప్రత్యేక ప్రవేశ దర్శనం, సర్వదర్శనం టోకెన్ల(darshan tokens) అదనపు కోటా టికెట్లను టీటీడీ(TTD) విడుదల చేసింది. శ్రీవారి దర్శనానికి సంబంధించి ఫిబ్రవరి 24 నుంచి 28వ తేదీ వరకు అదనంగా రోజుకు 13,000 చొప్పున రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఫిబ్రవరి 23వ తేదీ బుధవారం నుండి టిటిడి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనుంది. అదేవిధంగా, ఫిబ్రవరి 26 నుండి 28వ తేదీ వరకు అదనంగా రోజుకు 5,000 చొప్పున సర్వదర్శనం టోకెన్లను ఆఫ్‌లైన్‌లో తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్, శ్రీ గోవిందరాజస్వామి సత్రాల్లో ఏర్పాటుచేసిన కౌంటర్లలో భక్తులకు ఇస్తారు.
కాగా, మార్చి నెలకు సంబంధించి రోజుకు 25 వేలు చొప్పున రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను ఫిబ్రవరి 23న ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. అదేవిధంగా, మార్చి నెలకు సంబంధించి రోజుకు 20 వేలు చొప్పున సర్వదర్శనం టోకెన్లు ఆఫ్‌లైన్‌లో తిరుపతిలోని కౌంటర్ల ద్వారా కేటాయిస్తారు.