
తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. తిరుమల శ్రీవారి దర్శనానికి టీటీడీ జారీ చేసే ఉచిత దర్శన టికెట్ల సమయాల్లో మార్పులు చేసింది. స్లాటెడ్ సర్వ దర్శనం టోకెన్లను(ఎస్‌ఎస్‌డీ) ప్రతీ రోజూ తిరుపతిలో టీటీడీ జారీ చేస్తోంది. ఈ టోకెన్లు జారీ చేసే సమయాల్లో టీటీడీ మార్పులు చేసింది. ఇప్పటివరకు ఉదయం 5 గంటలకు వీటిని అందిస్తున్నారు. అయితే ఇక నుంచి మధ్యాహ్నం 1.30 గంటల నుంచి పంపిణీ చేయనున్నారు. శుక్రవారం నుంచే ఈ సమయాల్లో మార్పులు చేశారు. శ్రీవారి దర్శనం కోసం భక్తులకు తిరుపతిలోని మూడు ప్రాంతాల్లో ఎస్‌ఎస్‌డీ దర్శన టికెట్లను అందిస్తోంది. రైల్వే స్టేషన్ పక్కన ఉండే విష్ణునివాసం, బస్టాండ్ సమీపంలోని శ్రీనివాసం కాంప్లెక్స్, అలిపిరి మెట్ల దగ్గర ఉండే భూదేవి కాంప్లెక్స్‌లో ఈ టోకెట్లను అందిస్తున్నారు. రోజుకు 15 వేల టోకెన్ల వరకు జారీ చేస్తున్నారు.
కాలినడకన శ్రీవారి దర్శనానికి వెళ్లేవారి కోసం మరో 2 వేల టోకెన్లను అందిస్తున్నారు. ఓరిజినల్ ఆధార్ లేదా ఆధార్ కార్డు జిరాక్స్ అందిస్తే మీ ఫొటో తీసుకుని ఈ దర్శనం టోకెన్ ఉచితంగా అందిస్తారు. అయితే రెండు, మూడు గంటల పాటు క్యూలైన్లలో వెయిట్ చేయాల్సి ఉంటుంది. మొన్నటివరకు వేసవి రద్దీ కారణంగా భక్తుల తాకిడి ఎక్కువగా ఉండటంతో ఉదయం 4 లేదా 5 గంటల సమయంలో జారీ చేశారు. ఇప్పుడు స్కూళ్లు ప్రారంభం కావడం, వేసవి సెలవులు ముగియడంతో భక్తుల రద్దీ తగ్గింది. దీంతో టికెట్లు అందించే సమయాల్లో మార్పులు చేశారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ అధికారులు తెలిపారు.
అటు జూన్ 25వ తేదీ నుంచి 29వ తేదీ వరకు తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో తెప్పో్త్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఏర్పాట్లను టీటీడీ జేఈవో శరత్ పరిశీలించారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కోరారు. భక్తులు అసౌకర్యానికి గురి కాకుండా విద్యుత్, త్రాగునీరు, దర్శన సౌకర్యాలు కల్పించాలని కోరారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని సూచించారు. తెప్పల ఫిట్‌నెస్ పరిశీలించేలా ట్రయల్ రన్ నిర్వహించాలని సూచించారు. విద్యుత్, పుష్పాల అలంకరణలతో తెప్పలను తీర్చిద్దాలని తెలిపారు. ఇక కోలాటాలు, సంగీత కచేరీలు లాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. అటు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.