జాతీయ గో మహాసమ్మేళనం ప్రారంభోత్సవంలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కీలక కామెంట్స్ చేశారు. నేలతల్లిని రక్షించడానికే జాతీయ గో మహాసమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గో ఆధారిత వ్యవసాయ రైతులకు టీటీడీ అండగా ఉంటుందని చెప్పారు. రైతులకు గిట్టుబాటు ధర చెల్లించి గో ఆధారిత ఉత్పత్తులను కొనుగోలు చేస్తామని చెప్పారు. గోవును జాతీయ ప్రాణిగా గుర్తించాలని టీటీడీ పాలక మండలిలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి విన్నవించినట్లు తెలిపారు. సీఎం జగన్ సూచనల మేరకు టీటీడీ పాలక మండలి సనాతన హిందూ ధర్మ ప్రచారం చేస్తూనే, గో సంరక్షణ కోసం పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తోందని చెప్పారు. వందల సంవత్సరాల నాటి సంప్రదాయాన్ని పునరుద్ధరించి.. గో ఆధారిత వ్యవసాయంతో పండించిన పంటలతో శ్రీవారికి నైవేద్యం సమర్పిస్తున్నామని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. రసాయన ఎరువులతో తయారుచేసిన దాణా తినే ఆవుల పాల వల్ల మహిళల్లో క్యాన్సర్ పెరుగుతోందని అధ్యయనాల్లో తేలిందని.. అందువల్లే సీఎం జగన్ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. దేశం ఆర్థికంగా, ధార్మికంగా, ఆరోగ్యపరంగా బాగుపడాలంటే గో సంరక్షణే ఏకైక మార్గమన్నారు. గోవులను పూజించడం, సంరక్షించడం మనందరి కర్తవ్యమని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.
జాతీయ గో మహాసమ్మేళనం సందర్భంగా… మహతి కళాక్షేత్రం ప్రాంగణంలో 24 స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఇందులో నాలుగు స్టాల్స్ టీటీడీ ఆధ్వర్యంలో ఉత్పత్తి చేయబడుతున్న అగరబత్తులు, ఆయుర్వేద – పంచగవ్య ఉత్పత్తులు, టీటీడీ ప్రచురణలు, డ్రై ఫ్లవర్ టెక్నాలజీతో తయారు చేసిన చిత్రపటాలను ఉంచారు. గో మహాసమ్మేళనానికి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుండి విచ్చేసిన రైతులకు శ్రీనివాసం వసతి సముదాయము, ఎస్.వి.విశ్రాంతి భవనం, పద్మావతి నిలయం, గోవిందరాజస్వామివారి 2,3వ సత్రాల్లో వసతి సౌకర్యం ఏర్పాటు చేశారు. టీటీడీ అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో గో సమ్మేళనానికి విచ్చేసిన రైతులకు సాంప్రదాయ భోజనం, త్రాగునీరు అందిస్తున్నారు.
Also Read: పెళ్లి రోజున భర్తతో ఉన్న అందమైన ఫోటో షేర్ చేసిన చందమామ కాజల్