Tirupati MLA Bhumana Karunakar Reddy : దాతృత్వాన్ని ప్రదర్శించడంలో ఎప్పుడూ ముందుండే తిరుపతి ఎమ్మెల్యే భుమన కరుణకర్ రెడ్డి కరోనా కష్టకాలంలో నేనున్నానంటూ నియోజకవర్గంలోని అనేక అంశాల్లో ముందుకొస్తున్నారు. అనాధలైన కరోనా రోగుల అంత్యక్రియల్లో తరచూ పాల్గొంటూ మానవత్వాన్ని చాటుతున్నారు. కుల, మతాల కతీతంగా కరుణాకర్ రెడ్డి స్థానిక ముస్లిం యువజన సంఘంతో కలిసి కొవిడ్ మృతులకు అంతమ సంస్కారాలు నిర్వహిస్తున్నారు. భూమన అతని బృందం ఆయా మతస్తుల మత సంబంధిత సంప్రదాయాల ప్రకారం కొవిడ్ ఇన్ఫెక్షన్తో మరణించిన వ్యక్తులకు ఇవాళ చివరి కర్మలు చేశారు. స్థానిక ముస్లిం యువజన సంఘంతో కలిసి ఇప్పటివరకు 500 మందికి పైగా అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
ఇవాళ కరోనా మహమ్మారి బారిన పడి చనిపోయిన, వెనుకా మందు ఎవరూ లేని ఒక హిందూ మహిళ, వృద్ధ ముస్లిం పురుషుడు, ఒక క్రైస్తవ యువకుడికి భూమన బృందం అంత్యక్రియలు నిర్వహించి మరోమారు తమ మానవత్వాన్ని చాటుకున్నారు. కాగా, 64 ఏళ్ల భూమన ఇప్పటికే రెండుసార్లు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.
కాగా, మొన్న గురువారం తిరుపతిలో యువత మత్తుపదార్థాలకు బానిసలుగా మారుతోన్న దృశ్యాల్ని చూసి భూమన చలించిపోయారు. ఈ అంశంపై ఆయన తిరుపతి అర్బన్ ఎస్పీకి అదేరోజు ఫిర్యాదు చేశారు. సైకిల్ పై సామాన్యుడిగా తిరుపతి వీధుల్లో తిరుగుతుంటే గంజాయి మత్తులో ఉన్న యువకుల్ని చూశానని.. తిరుపతి లో గంజాయి అమ్మకాలను అరికట్టడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పోలీసుల్ని కోరారు. ఈ మేరకు భూమన మూడు పేజీల ఫిర్యాదుని స్వయంగా ఎస్పీ అప్పలనాయుడికి ఇచ్చారు.
దేశానికి మార్గనిర్దేశం చేయాల్సిన యువత గంజాయి మత్తులో తూగుతుంటే ఎమ్మెల్యేగా తల్లడిల్లిపోయానన్నారు. తిరుపతి పవిత్ర నగరంలో గంజాయి, ఇతర మత్తు పదార్థాలు విచ్చలవిడిగా దొరుకుతున్నాయని ఆయన చెప్పారు. డ్రగ్స్ కి బానిసలైన యువకులు సంఘ విద్రోహ శక్తులుగా మారుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మాయిలకు సైతం ఈ మత్తు అలవాటు చేసి వారిని వల్లో వేసుకుని పశు వాంఛ తీర్చుకుంటున్నారని ఎమ్మెల్యే వెల్లడించారు.