తిరుమలలో పాము కలకలం చెలరేగింది. అలిపిరి మెట్ల మార్గంలో శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్తున్న భక్తులు ఒక్కసారిగా భారీ నాగుపామును చూసి కంగుతిన్నారు. అటవీ ప్రాంతం నుంచి మెట్లపైకి వచ్చిన పాము.. పడగ విప్పి బుసలు కొడుతూ భక్తులను భయభ్రాంతులకు గురిచేసింది. అలిపిరి(alipiri) కాలిబాట మార్గంలో 6 అడుగుల నాగు పాము సంచరించడాన్ని చూసిన భక్తులు భయంతో కేకలు వేస్తూ.. అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ విషయం తెలుసుకున్న భద్రతా సిబ్బంది వెంటనే అలెర్టయ్యారు. తిరుమల తిరుపతి(Tirupati)లో ఇప్పటికే ఎన్నో పాములు పట్టిన భాస్కర్ నాయుడు(Snake catcher Bhaskar Naidu)కు భద్రతా సిబ్బంది సమాచారం ఇవ్వగా… ఆయన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. తర్వాత చాలా సేపు కష్టపడి 6 అడుగుల పొడువున్న నాగుపామును చాకచక్యంగా పట్టుకున్నారు. ఆపై, కాసేపు పాముతో అక్కడే విన్యాసాలు చేసి భక్తులను అలరించారు. తర్వాత దానికి ఎలాంటి హాని జరగకుండా సంచిలో వేసుకొని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టాడు. దీంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.
కాగా, తిరుమలలో పాములు ఎప్పుడు.. ఎక్కడ కనిపించినా స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడుకు ఫోన్ వెళ్తుంది. అయితే ఇటీవల ఓ పామును పడుతుండగా.. అది కాటు వేసింది. దీంతో ఆయనకు చాలా సీరియస్ అయ్యింది. 13 రోజులుగా మృత్యువుతో పోరాడి విజయం సాధించారు. తిరుమల(Tirumala), తిరుపతిలో 10వేలకు పైగా పాములను పట్టుకున్నారు భాస్కర్ నాయుడు. తిరుమల, తిరుపతి పరిసర ప్రాంతాల్లో పాములు కనిపిస్తే వెంటనే భాస్కర్‌నాయుడిని సంప్రదించటానికి వాకీటాకీ ఇచ్చారు. పాములు పట్టుకోవటానికి చేతికి గ్లౌజులు, రెండు పరికరాలతో పాటు ఓ బైక్ కూడా టీటీడీ ఏర్పాటు చేసింది.